రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసు 400 రూపాయలకు
భారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ ధరలను తగ్గించింది. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను డోసు 400 రూపాయలకే సరఫరా చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తొలుత బారత్ బయోటెక్ ఈ రేటు 600 రూపాయలుగా ప్రకటించింది.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తాజాగా రేటు 400 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం డోసు 1200 రూపాయలకు సరఫరా చేయనున్నట్లు తొలుత ప్రకటించింది.
ఇప్పుడు ఆ రేటుపై ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో పాత రేటే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవిషీల్డ్ ధరను తొలుత రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇస్తామన్నారు. బుధవారం నాడు సీరమ్ కూడా ఈ రేటును 400 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దేశం ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజలకు మేలు చేసేలా రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.