టైమ్ ఉంటే వంద సీట్లు గెలిచేవాళ్లం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరింత సమయం ఉంటే వంద సీట్లు గెలిచి ఉండేవాళ్లం అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అభ్యర్ధులను ఖరారు చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎన్నికలు పెట్టారని విమర్శించారు. అయినా బిజెపిని ప్రజలు 48 సీట్లలో ఆదరించటం సంతోషంగా ఉందన్నారు. అతి తక్కువ సమయం ఉన్నా బిజెపి కార్యకర్తలు మంచి పోరాటం చూపించారన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె. లక్ష్మణ్ లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బిజెపి భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఈసీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు నడిచిందని ఆరోపించారు. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు పెట్టారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని విమర్శించారు.
టీఆర్‌ఎస్ అడ్డదారిలో వెళ్లి గెలిచేందుకు ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. ఎంఐఎంకు బీజేపీ అడ్డుకునే స్థాయి లేదన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుమార్చుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం నిధుల విషయంలో హైదరాబాద్ అభివృద్దికి సహకరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. జానారెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై స్పందిస్తూ. ఆయన నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. అలాగే ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.