Telugu Gateway
Telangana

చెప్పుల వివాదం.. అప్పుడు అంజయ్య‌..ఇప్పుడు బండి సంజ‌య్

చెప్పుల వివాదం.. అప్పుడు అంజయ్య‌..ఇప్పుడు బండి సంజ‌య్
X

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ చెప్పుల వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షాకు ఆయ‌న హ‌డావుడిగా చెప్పులు అందించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేత‌లు బండి సంజ‌య్ పై ఎటాక్ ప్రారంభించారు. అంతే కాదు..ఆయ‌న పై సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కెటీఆర్ ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. అంటూ పేర్కొన్నారు.

ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా ట్విట్ట‌ర్ వేదికగానే స్పందించారు. ''తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీ లో బీసీ నేత స్థానం ఏంటో చూడండి. తెలుగు వారి ఆత్మగౌరవం ఇదేనా?.. అమిత్ షా చెప్పులు మోయడమేంటి'' అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ కూడా బండి సంజ‌య్ తీరును త‌ప్పుప‌ట్టారు. బండి సంజ‌య్ తాజా చెప్పుల ఘ‌ట‌న‌తో ఎప్పుడో దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అంజ‌య్య వ్య‌వ‌హారాన్ని గుర్తుకుతెచ్చార‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి. అంజ‌య్య కూడా ఓ సారి విమానాశ్ర‌యం రాజీవ్ గాంధీ చెప్పులు మోసిన వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద దుమారం రేపింది.

Next Story
Share it