బిజెపిలో అలా సీఎం కాలేరు
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి ఎవరిని ఉద్దేశించి చేశారన్న అంశంపై చర్చ సాగుతోంది. పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావు అని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారు. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరికీ టికెట్లు రావు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారు.ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరు. అధ్యక్షుడైప్పటికీ.. నా టికెట్ పై కూడా స్పష్టత లేదు.
యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారే టికెట్ రాలేదు'' అని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీలో సీనియర్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కెసీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను అడ్డుకునే ఆలోచన చేస్తున్నారని..ఇలాంటి వాటికి తాము భయపడేది లేదన్నారు.తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకు అయినా సిద్ధం అని తెలిపారు.