Telugu Gateway
Telangana

ఉద్య‌మ ద్రోహుల‌ను చేర‌దీసింది కెసీఆరే

ఉద్య‌మ ద్రోహుల‌ను చేర‌దీసింది కెసీఆరే
X

ప్ర‌ధాని మోడీ కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తే టీఆర్ఎస్ కు వ‌చ్చిన నొప్పి ఏంటి అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్ర‌శ్నించారు. బిజెపి తెలంగాణ‌కు వ్య‌తిరేకం అని మోడీ ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నారు. అస‌లు తెలంగాణ వ‌ద్ద‌ని వ్యాఖ్యానించిన ఉద్య‌మ ద్రోహుల‌ను చేర‌దీసింది సీఎం కెసీఆర్ మాత్ర‌మే అన్నారు. తెలంగాణ మంత్రివ‌ర్గంలో ఎంత మంది ఉద్య‌మ‌కారులు ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బుధవారం నాడు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకుల డ్రామాలను ప్రజలు నమ్మరు అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక జోకర్ అయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ అని... ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పెప్పర్ స్ప్రే కొట్టినా పారిపోకుండా తెలంగాణ బిల్లుకు నిలబడింది సుష్మాస్వరాజ్ అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్‌కు ఇంట్రస్ట్ లేదన్నారు.

అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లు పెడతారా లేదా అని హెచ్చరిస్తే కాంగ్రెస్ బిల్లు పెట్టిందని బండి సంజ‌య్ తెలిపారు. కేసీఆర్ సెంటిమెంట్ డ్రామాను ఎవరు నమ్మరని తెలిపారు. నీళ్లపై అన్యాయం జరిగితే మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఫౌం హౌస్‌లో పండుకున్నారా అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసింది... కేసీఆర్ ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నారా? అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం కాదు, కేసీఆర్ విగ్రహం పెట్టుకుంటారా? అని అన్నారు. తెలంగాణ విభజనను మోడీ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిని కేసీఆర్ కలిసినప్పుడు విభజన హామీలు గుర్తుకు రాలేదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Next Story
Share it