Telugu Gateway
Telangana

కెసీఆర్ తీసుకున్న జీతం ఎంత‌?. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో...ఫాంహౌస్ లో ఉన్న రోజులెన్ని?.!

కెసీఆర్ తీసుకున్న జీతం ఎంత‌?.  ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో...ఫాంహౌస్  లో ఉన్న రోజులెన్ని?.!
X

బిజెపి రూట్ మార్చింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్ టిఐ) ద్వారా అధికారికంగా స‌మాచారం తీసుకుని ఆ స‌మాచారం ఆధారంగా సీఎం కెసీఆర్ ను టార్గెట్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా స్వ‌యంగా తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ ఆర్ టిఐ కింద ఏకంగా వంద ప్ర‌శ్న‌ల‌తో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు. సీఎం అయిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సీఎం కెసీఆర్ తీసుకున్న జీతం ఎంత‌?. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ...ఫాంహౌస్ లో ఆయ‌న ఉన్న రోజులెన్ని?.!. ఇత‌ర రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌ల్లో బ‌స చేసింది ఎక్క‌డ‌?. దానికి ఖ‌ర్చు పెట్టింది ఎంత‌?. 2014 జూన్ 2 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్ని ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు..ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు..రైతు రుణ మాఫీ. పోడు భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, తెలంగాణ‌లో ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌క్ష ఎక‌రాల‌కు నీరు ఇచ్చారు?. ధ‌ర‌ణి కింద వ‌చ్చిన ఫిర్యాదులు..ప‌రిష్కారం చేసిన‌వి ఎన్ని?. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించి..ఎప్పుడు పూర్తి చేశారు..దీన్ని క‌ట్టింది ఎవ‌రు...ఖ‌ర్చు చేసింది ఎంత అంటూ బండి సంజయ్ ఆర్ టిఐ కింద ద‌ర‌ఖాస్తులు చేశారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు..ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ సూప‌ర్ స‌క్సెస్ అవ‌టంతో అదే జోష్ లో బిజెపి త‌న దూకుడును కొన‌సాగిస్తూ ముందుకు సాగుతోంది. టార్గెట్ కెసీఆర్ కూడా ప్ర‌భుత్వ స‌మాచారంతో ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టటానికి రెడీ అవుతోంది. అయితే బండి సంజయ్ ఆర్ టిఐ ద‌ర‌ఖాస్తుల‌కు స‌ర్కారు స‌మాచారం ఇస్తుందా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే. తెలంగాణ‌లో పాల‌న అంతా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అంతా ర‌హ‌స్యంగానే సాగుతుంది జీవోల సైటులో కూడా ఎలాంటి వివ‌రాలు పెట్ట‌కుండా అంతా ర‌హ‌స్యంగానే ప‌నులు పూర్తి చేస్తున్నారు. మ‌రి ఈ బిజెపి దూకుడు స్ట్రాట‌జీకి అధికార టీఆర్ఎస్ ఎలాంటి కౌంట‌ర్ విధానంతో వ‌స్తుందో వేచిచూడాల్సిందే. 2014 జూన్ 2 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సీఎం కెసీఆర్ ఎన్ని సార్లు స‌చివాల‌యానికి హాజ‌ర‌య్యారు అన్న ప్ర‌శ్న‌తో కూడా ఓ ఆర్ టిఐ ద‌ర‌ఖాస్తు వేయ‌టం విశేషం.

Next Story
Share it