Telugu Gateway
Telangana

మ‌ల్లారెడ్డిపై దాడి..కేసులు న‌మోదు

మ‌ల్లారెడ్డిపై దాడి..కేసులు న‌మోదు
X

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న కొత్త మ‌లుపు తిరిగింది. ఆదివారం నాడు జ‌రిగిన రెడ్డి సంక్షేమ సంఘం స‌మావేశంలో మాట్లాడిన మంత్రి మ‌ల్లారెడ్డి సీఎం కెసీఆర్ పై పొగ‌డ్త‌లు కురిపించటం..మ‌ళ్లీ కెసీఆరే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించ‌టంతో కొంత మంది ఆయ‌న ప్ర‌సంగానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత రాళ్లు..బాటిళ్లు..కుర్చీలు విసిరేశారు. దీంతో ఆయ‌న అక్క‌డ నుంచి పోలీసుల సాయంతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ త‌న‌పై దాడి వెన‌క టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుట్ర ఉంద‌ని..త‌న‌ను హ‌త‌మార్చ‌టానికే ప్లాన్ చేశార‌ని ఆరోపించారు. అంతే కాదు..దాడి చేసిన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని అన్నారు. అన్న‌ట్లుగానే కేసులు న‌మోదు అయ్యాయి.

ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ నేత‌లు, బిజెపి నేత‌లు మంత్రి తీరును త‌ప్పుప‌ట్టారు. మ‌ల్లారెడ్డి త‌న ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు ఉంటే చూపాల‌న్నారు. మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ మాట్లాడుతూ రైతుల్లో వ్య‌తిరేక‌తే మ‌ల్లారెడ్డిపై దాడికి కార‌ణం అన్నారు.

Next Story
Share it