Telugu Gateway
Telangana

దీని వెనక అసలు ఎజెండా ఏంటి?

పెద్దల చేతుల్లో భూములు వెనక్కి తీసుకోవటం సాధ్యం అవుతుందా?

ఆంధ్ర ప్రదేశ్ లో గత జగన్ మోహన్ రెడ్డి సర్కారు అనుసరించిన మోడల్ నే ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నారు. అసైన్ మెంట్ భూములపై హక్కులు కల్పించబోతున్నట్లు తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇది జరిగితే ఈ భూములను అమ్ముకునే వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం అసైన్ మెంట్ భూములను విక్రయించడానికి వీలులేదు. అసైన్ మెంట్ భూములు పెద్దల చేతుల్లో ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అంటే అసైన్ మెంట్ భూములు కొన్ని పెద్దల చేతుల్లోకి వెళ్లాయని విషయం ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అలా జరిగినా మంత్రి చెపుతున్నట్లు వాటిని తిరిగి తీసుకోవటం అంతా ఈజీ గా జరిగే పనేనా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం అసైన్ మెంట్ హక్కుదారులకు వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముందే తెలుస్తుంది కాబట్టి ఏపీలో అప్పటి అధికార పార్టీ నేతలు, కొంత మంది ఉన్నతాధికారులు వందల ఎకరాల అసైన్ మెంట్ భూముల కొనుగోలుకు ముందు ఒప్పందాలు చేసుకుని ..తర్వాత తమ పేర్ల మీద మార్చుకున్నారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే అదనుగా ఏపీలో అప్పుడు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు చేతులు మారాయి. ప్రభుత్వాలు పేదలకు వెసులుబాటు కోసమే ఈ నిర్ణయం అని చెప్పినా కూడా దీని వెనక అసలు లక్ష్యం మాత్రం వేరే ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలాంటి నిర్ణయాల ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారు అనే విషయం తెలిసిందే.

ఇద్దరు తెలంగాణ కీలక మంత్రుల చేతుల్లో వేల కోట్ల అసైన్ మెంట్ భూములు !

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన అసైన్ మెంట్ భూములను బినామీలతో చేజికించుకున్నారు అనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. హైదరాబాద్ కు అత్యంత దగ్గర ఉండే ప్రాంతంలో వీళ్ళు అసలు హక్కుదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి ఒక మంత్రి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టగా...మరో మంత్రి, మరో కాంగ్రెస్ కీలక నేత ఈ వ్యవహారం సాఫీగా సాగేందుకు తమ వంతుగా సహకరించారు. తెలంగాణాలో కూడా ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి మోడల్ అమలు చేస్తారు అని...తెలుగు గేట్ వే .కామ్ 2024 డిసెంబర్ 19 న నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూమికి ఇద్దరు తెలంగాణా మంత్రుల స్కెచ్..పెట్టుబడి వందల కోట్లు ..ప్రయోజనం వేల కోట్లు అంటూ ఒక స్టోరీ ని ప్రచురించింది. అందులోనే తెలంగాలోనే కూడా జగన్ మోడల్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది అని స్పష్టం చేసింది.

ఇప్పుడు స్వయంగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంటే ఇది అంతా కూడా ఒక పక్కా పధకం ప్రకారం సాగింది అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. అయితే ఇద్దరు కీలక మంత్రులు చక్కపెట్టిన ఇంత పెద్ద డీల్ లో ప్రభుత్వం పెద్దల ప్రమేయం లేకుండా ఉండే ఛాన్స్ ఉండదు అని..అంతా కలిసే ఈ స్కీం డిజైన్ చేసి ఉంటారు అని మరో కీలక మంత్రి అభిప్రాయపడ్డారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఇష్టానుసారం భూములు దోచుకుంది అని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అసైన్ మెంట్ భూములను ఒక ప్లాన్ ప్రకారం కొల్లగొట్టే పనిలో ఉన్నారు అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కొంత మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమకు ఉన్న సమాచారం ఆధారంగా పలు జిల్లాల్లో అసైన్ మెంట్ భూముల హక్కుదారులతో ఒప్పందాలు చేసుకున్నారు అని..చట్టం అమల్లోకి వచ్చాక ఇవి అధికారికంగా వాళ్ళు చెప్పిన వారి పేర్ల మీదకు ఇవి మారిపోతాయని చెపుతున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో.

ఓల్డ్ స్టోరీ లింక్

https://telugugateway.com/telangana-telugu/telangna-ministers-big-land-deal-in-sulthanpur-total-cost-4000-crs-1350345


https://www.youtube.com/watch?v=Htq8aNd9sMI



Next Story
Share it