ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ మిస్ ఫైర్!

ముందు టీఎస్ఆర్ టీసీ..వెనక ఏపీఎస్ఆర్టీసీ
ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రకరకాల కార్యక్రమాలతో కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వినూత్న మార్గాలతో ఆయన టీఎస్ఆర్ టీసీ పై ప్రచారం చేస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే పనులు చేస్తున్నారు. తాజాగా సజ్జనార్ చేసి ట్వీట్ మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఈ ట్వీట్ పై నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం సజ్జనార్ చేసిన ట్వీట్ లో టీఎస్ ఆర్టీసీని ప్రమోట్ చేస్తూ..భీమ్లానాయక్ లోని ఓ సీన్ ను వాడుతూ వీడియో లింక్ షేర్ చేశారు. దీనికి 'ఏంది! డాని నన్ను ఫాలో అవుతున్నవ్.
ఇది ఏమైనా #BheemlaNayak బస్సా #TSRTC బస్సు,మనందరి బస్సు ' అంటూ కామెంట్ పెట్టారు. అయితే ఈ వీడియోలో బస్సు వెనక ఏపీ సీరిస్ నెంబర్ ఉంటే..ముందు మాత్రం టీఎస్ ఆర్ టీసీ అని ఉంది. కొంత మంది నెటిజన్లు దీన్ని ఇలాకూడా వాడతారా అంటూ కామెంట్స్ చేస్తే..ఈ బస్సుకు వెనక ఏపీ నెంబర్ ఉంది కదా సర్ అంటూ కామెంట్ చేశారు. అయితే దీన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం భారీగా షేర్ చేస్తున్నారు. మరో నెటిజన్ వాడకం అంటే ఇలాగే ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు.



