బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు కేంద్ర నిధులు ఇవ్వాలన్నాలని లేఖలో కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రాథమిక మూలధనాన్ని వెంటనే అందించాలని కేటీఆర్ కోరారు. ప్రతిపాదిత రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లకు సుమారు 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని అయితే ఇందులో కనీసం 50 శాతం నిధులను రానున్న బడ్జెట్లో కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలను ఫార్మా సిటీ తో తెలంగాణ మరింత ముందుకు తీసుకుపోతుందన్న నమ్మకాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో స్వదేశీ పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే దిశగా ఫార్మాసిటీ ఉంటుందన్నారు.
జాతీయ ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీ కి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మాసిటీ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 64 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల సదుపాయాల కోసం సుమారు 4922 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామన్నారు. వచ్చే బడ్జెట్ లో కనీసం 870 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కోరారు.