హారిక ఎవరో తెలియదు...అవసరం అయితే కొనసాగిస్తాం
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు
తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ బుధవారం నాడు హారిక అంశంపై మరో ప్రకటన చేశారు. ఆయన మంగళవారం నాడు అసలు హారిక ఎవరో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అసలు ఈ నియామకం ఎలా జరిగిందో కూడా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బుధవారం నాడు సడన్ గా ఈ అంశంపై మరో ట్విస్ట్ ఇచ్చారు. అందరూ ఓకే అంటే హారికను కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని మీడియాతో వ్యాఖ్యానించారు. అసలు తనకే హారిక ఎవరో తెలియదని చెప్పిన మంత్రి..అలాంటి వ్యక్తిని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తామని ఎలా ప్రకటిస్తారన్నది మరో కొత్త చర్చకు తెరతీసింది.
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. ఆయనది తన జిల్లాకాదని..తమతో కలసి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాదన్నారు. ఏదో సామాజిక సేవ చేస్తూ వచ్చిన వ్యక్తి అన్నారు. ఛైర్మన్ కొత్తగా బాధ్యతలు చేపట్టినందున తెలియక ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని..సీఎం కెసీఆర్ దగ్గర కూర్చుని...ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని తెలిపారు. ఏదైనా తమ నాయకుడికి చెప్పి చేయటం తమ పద్దతి అన్నారు. ఇదిలా ఉంటే టీఎస్ టీడీసీ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు హారిక ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించింది. కొన్ని కారణాల వల్ల ఈ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నానని..తన పని తాను చేసుకుంటానని ప్రకటించింది.