Telugu Gateway
Telangana

నగరంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

నగరంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
X

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మందిని భయపెడుతున్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్ని ఉంటాయనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటి రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అనే చర్చ కూడా గత కొంత కాలంగా సాగుతోంది. అంతే కాదు ఐటి రంగంలో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు జరిపే ఇంటర్వ్యూ ల్లో కూడా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే. ఈ తరుణం లో తెలంగాణ ప్రభుత్వం కూడా మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో ఐటి రంగానికి సంబంధించిన ప్రధాన నగరాల్లో బెంగళూరు తర్వాత స్థానం హైదరాబాద్ దే అన్న విషయం తెలిసిందే.

రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ ను ఐటి రంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు కోసం రెండు వందల ఎకరాల భూమి కేటాయించినట్లు తెలంగాణ ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జులై లో హైదరాబాద్ కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐ రంగానికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు అవకాశం కలిపించేందుకు ఈ యూనివర్సిటీ దోహదం చేయనుంది. బహుశా దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రము కూడా ఈ దిశగా ముందడుగు వేసినట్లు లేదు అనే చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో కేవలం నలబై ఎకరాల్లో కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు. కానీ తెలంగాణ సర్కారు 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని నిర్ణయించటంతో దేశంలో ఇదే అతి పెద్ద ఏఐ సిటీ గా అవతరించే అవకాశం ఉంది.

Next Story
Share it