Telugu Gateway
Telangana

మీడియా లో మరో కొనుగోలు

మీడియా లో మరో కొనుగోలు
X

గౌతమ్ అదానీ. గత పదేళ్లుగా చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎన్నో సంవత్సరాలుగా భారత్ లో నంబర్ వన్ గా సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ ని వెనక్కి నెట్టి మరి ముందుకు వచ్చాడు. అయన ప్లేస్ ఆక్రమించాడు. తర్వాత హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు నంబర్లు మారుతున్నాయి. భారత్ లోనే కాదు...ఏకంగా ప్రపంచ సంపనుల్లోనే టాప్ ఫైవ్ ప్లేసుల్లోకి కూడా వెళ్ళివచ్చాడు. భారత్ లో గత కొన్ని రోజులుగా మళ్ళీ అదానీ గ్రూప్ షేర్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అదానీ గ్రూప్ ఈ విషయంలో స్పీడ్ పెంచింది. తాజాగా అదానీ గ్రూప్ కంపెనీగా ఉన్న ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ ద్వారా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ న్యూస్ ఏజెన్సీలో 50 .50 శాతం వాటా కొనుగోలు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది.

ఇప్పటికే అదానీ గ్రూప్ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్ డిటివి ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు క్వినిటీలియాన్ బిజినెస్ మీడియా లో కూడా వాటాలు సేకరించింది. తాజాగా ఐఏఎన్ఎస్ లో మెజారిటీ వాటా దక్కించుకుని ఈ ఏజెన్సీ ని నియంత్రణలోకి తెచ్చుకుంది. కేంద్రంలో మోడీ ప్రధాని అయిన దగ్గరనుంచి అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు పలు ఇతర పార్టీల నేతలు కూడా అనేకసార్లు విమర్శలు గుప్పించారు. ఒక వైపు భారీగా వ్యాపారాన్ని విస్తరిస్తూ మరో వైపు ఇప్పుడు మీడియా పై కూడా అదానీ పట్టు బిగిస్తూ పోతుండటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి.

Next Story
Share it