Telugu Gateway
Telangana

లిక్క‌ర్..సోడాలా క‌ల‌సిపోయిన రాజ‌కీయ నేత‌లు..వ్యాపారులు!

లిక్క‌ర్..సోడాలా క‌ల‌సిపోయిన రాజ‌కీయ నేత‌లు..వ్యాపారులు!
X

ఢిల్లీ..పంజాబ్ ఆప్ స‌ర్కార్ల యాడ్స్ అన్నీ వాళ్ళిద్ద‌రి చేతిలోనే?!

రాజ‌కీయం..వ్యాపారం క‌ల‌సిపోయాయి. ఎంతలా అంటే లిక్క‌ర్, సోడాలా. మ‌ధ్య‌లో మేం ఎందుకు వెన‌క‌బ‌డిపోవాలి అనుకున్నారేమో కొంత మంది మీడియా అధిప‌తులూ ఇందులో చేరుతున్నారు. ఎవ‌రికి దొరికినంత వాళ్లు దండుకుంటున్నారు. అలాంటిదే ఈ వ్య‌వ‌హారం కూడా. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ బ‌ట్ట‌బ‌య‌లు కావ‌టంతో ఎన్నో కొత్త కొత్త కోణాలు..వ్యాపార మోడ‌ల్స్ వెలుగులోకి వ‌స్తున్నాయి. అందులో భాగంగా తాజాగా మ‌రో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ హైద‌రాబాద్ కు చెందిన వ్యాపార‌వేత్త బోయిన‌ప‌ల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆయ‌న చెప్పే స‌మాచారం అత్యంత కీల‌కంగా మార‌నుంది. దీంతో చాలా మంది కీల‌క నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఈ వ్యాపారం ఒక్క లిక్క‌ర్ కే ప‌రిమితం కాలేదు. ఢిల్లీ, పంజాబ్ ల్లో ఉన్న‌ది అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ ప్ర‌భుత్వాలు. ఆప్ కు కేజ్రీవాల్ జాతీయ క‌న్వీన‌ర్ గా ఉన్నారు..ఢిల్లీ సీఎం ఆయ‌నే అన్న విష‌యం తెలిసిందే. లిక్క‌ర్ స్కామ్ కు. ఆప్ స‌ర్కారుకు సంబంధం ఉంద‌న‌టానికి విచార‌ణ సంస్థ‌ల‌కు ప‌లు ఆధారాలు దొరికిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అదేంటి అంటే ఢిల్లీ, పంజాబ్ ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ యాడ్స్ అన్నీ కూడా అటు అభిషేక్, ఓ మీడియా సంస్థ అధినేత గా ఉన్న భాగ‌స్వామ్య సంస్థ జ్యుస్ యాడ్స్ పేరుతో సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఢిల్లీ, పంజాబ్ ప్ర‌భుత్వాలు వివిధ కార్య‌క్ర‌మాల కోసం జాతీయ స్థాయి ప‌త్రిక‌ల‌కు భారీ ఎత్తున యాడ్స్ ఇస్తుంది. ఈ వ్యాపారం ఏటా వంద‌ల కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంది. ఇందులో ఉండే క‌మిష‌న్ల వ్య‌వ‌హారం మామూలుగా ఉండ‌దు. ఈ రోజుల్లో ప‌లు మీడియా సంస్థలు భారీ డిస్కౌంట్ల‌తో యాడ్స్ వేయ‌టానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నాయి. ఈ వ్యాపారంలో ఉన్న వారికి ఈ విష‌యం బాగా తెలుసు. ఈ రెండు ప్ర‌భుత్వాల యాడ్స్ అన్నీ కూడా ఈ సంస్థ‌ల ద్వారానే సాగుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అభిషేక్ ఖాతాల నుంచి మీడియా సంస్థ‌కు రెండు ద‌ఫాలుగా మొత్తం ఆరు కోట్ల రూపాయ‌ల న‌గ‌దు బ‌దిలీ అయిన‌ట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అటు లిక్క‌ర్ స్కామ్ కు ప‌థ‌క ర‌చ‌న చేయ‌టంతోపాటు యాడ్స్ వ్యాపారంలోనూ వీరంతా భాగ‌స్వాములుగా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయ నేత‌లు ఇలా బినామీ పేర్ల‌తో అవ‌కాశం ఉన్న ప్ర‌తి రంగంలోనూ కార్య‌కలాపాలు సాగిస్తున్నార‌ని, ఇందుకు ఈ యాడ్స్ వ్య‌వ‌హారం ఓ నిద‌ర్శ‌నం అని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it