Telugu Gateway
Telangana

శంషాబాద్ నుంచి సింగపూర్‌కు వైడ్ బాడీ విమాన సర్వీసు ప్రారంభం

శంషాబాద్ నుంచి సింగపూర్‌కు వైడ్ బాడీ విమాన సర్వీసు ప్రారంభం
X

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నుంచి హైదరాబాద్-సింగపూర్ సెక్టార్ మధ్య A305-900 వైడ్ బాడీ విమాన సర్వీసు ప్రారంభమైంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) కు చెందిన ప్రారంభ వైడ్-బాడీ సర్వీస్ SQ 523 నిన్న (అక్టోబర్ 30) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి 11.20 గంటలకు బయలుదేరి వెళ్లింది. GHIAL సీనియర్ అధికారులు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో మొదటి వైడ్-బాడీ విమాన సర్వీసును ప్రారంభించారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్- సింగపూర్ మధ్య ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో A350 సర్వీసును నడుపుతుంది. మిగిలిన రోజుల్లో B737-8 నారో బాడీ సేవలు కొనసాగుతాయి. వైడ్-బాడీ A350-900లో ఎత్తైన సీలింగ్, పెద్ద కిటికీలు, ఎక్స్ ట్రా వైడ్ కారణంగా ఎక్కువ స్థలం, సౌకర్యం ఉంటుంది. అలాగే దీని లైటింగ్‌ను కూడా జెట్‌లాగ్‌ను తగ్గించేలా రూపొందించారు. దక్షిణ, మధ్య భారతదేశ ప్రయాణికులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానాలలో సింగపూర్ ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాల పట్ల క్రమంగా పెరుగుతున్న ఆసక్తి కారణంగా హైదరాబాద్ నుండి అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ఈ నూతన వైడ్ బాడీ సర్వీసు హైదరాబాద్-సింగపూర్, ఆ పైనున్న దేశాలలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. సింగపూర్‌ను దాటి ఆస్ట్రేలియా వంటి గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు హైదరాబాద్ నుండే అధునాతన A 350 విమానం ఎక్కవచ్చు.

ప్రయాణీకులు హైదరాబాద్ నుండి సిడ్నీ, మెల్బోర్న్‌లకు సింగపూర్ మీదుగా 14 గంటల ప్రయాణ సమయంలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. HYD నుండి ఈ ప్రయాణ సమయం ఇతర భారతీయ విమానాశ్రయాల ద్వారా ఈ ఆస్ట్రేలియన్ గమ్యస్థానాలకు ప్రయాణించడం కంటే తక్కువ. ఆస్ట్రేలియాకు వెళ్లే అంతర్జాతీయ పర్యాటకులలో భారతీయ పర్యాటకులే అత్యధికం. భారత-ఆస్ట్రేలియాల మధ్య రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో అన్ని కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో, గత కొన్ని నెలలుగా భారతీయ సందర్శకులలో అసాధారణ పెరుగుదల ఉంది. భారతదేశ ఆర్థిక వ్యూహం ప్రకారం, 2035 నాటికి యేటా 70 మిలియన్లకు పైగా భారతీయులు విదేశాలకు ప్రయాణిస్తారు. ఇదే సమయంలో 1.2 మిలియన్ల మంది సందర్శకులు ఆస్ట్రేలియాను సందర్శిస్తారని అంచనా. దక్షిణాది ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున VFR (స్నేహితులు మరియు బంధువులను సందర్శించడం), పర్యాటకులు, వలసదారులు మరియు ఆస్ట్రేలియాకు విద్యార్థుల రద్దీ ఉంది. జూలైలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 42 వేల మంది ప్రయాణికులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్టోబరు, నవంబరులలో ఆస్ట్రేలియాలో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతుండటంతో, క్రీడా ఔత్సాహికులు A 350 విమానంలో ఈ మ్యాచ్‌లు చూడడానికి వెళ్లవచ్చు అని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story
Share it