వీటి వెనక కథ ఏంటి?!

బిఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి భారీ దోపిడీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద స్కాం అని చెప్పారు. తమకు అధికారం అప్పగిస్తే చాలు ప్రజల సొమ్మును మింగిన వాళ్ళను కటకటాల పాలు చేస్తామని ఎన్నో మాటలు చెప్పారు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వరం మార్చారు. తాను కక్షపూరిత రాజకీయాలు చేయనంటూ రాజనీతిజ్ఞుడు (స్టేట్స్ మెన్) స్టైల్ లో ప్రకటనలు చేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని ప్రకటనలు అయినా చేసి....అధికారంలో ఉన్న వాళ్ళు..రాజకీయ పార్టీల నేతలు ప్రజల సంపదను ఎలా..ఎంత దోచుకున్నా కూడా ఏమీ చేయం అన్న చందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి మారిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు అవుతున్నా కూడా గత బిఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు..అవినీతికి సంబంధించి ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా చర్యలు లేవు. దీంతో
చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలు అన్నిటిని సెటిల్మెంట్స్ కోసం...రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయాన్ని కొంత మంది కాంగ్రెస్ మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణ కు తెలంగాణాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారిన కాళేశ్వరం స్కాం కు సంబంధించి అత్యంత కీలకమైన అవినీతి పోర్షన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ పరిధి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు తప్పించటంతోనే ఆయన విశ్వసనీయతపైనే అనుమానాలు బలపడ్డాయని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు మరో సంచలన అంశం ధరణి. ఫోరెన్సిక్ ఆడిట్ అంటేనే అన్ని విషయాలను...అన్ని కోణాల్లో విచారణ చేసి వెలుగులోకి తెచ్చేది. ఇది పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఎంక్వయిరీ టీం (సెట్) వేసి అంతా సెట్ చేసుకున్నట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే గత బిఆర్ఎస్ హయాంలో ధరణి స్కాం సాగితే ఇప్పడు రేవంత్ రెడ్డి సర్కారు 22 ఏ స్కాం లో ఇరుక్కుంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలో ఇప్పుడు 22 ఏ భూముల వ్యవ్యహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పైనే పెద్ద ఎత్తున విమర్శలు..ఆరోపణలు వినిపిస్తున్నాయి.
22 ఏ భూముల విషయం తాను నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటించటంతో ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోమవారం నాడు మూసారాం బాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి లాగానే బిఆర్ఎస్ హయాంలో లక్ష కోట్లు దోచుకున్నారు అని ఆరోపించారు. మరి అలా దోచుకున్న వాళ్ళను రేవంత్ రెడ్డి సర్కారు ఈ వెయ్యి రోజుల్లో ఏమి చేసింది అంటే జీరో అనే చెప్పొచ్చు. ఇవే కాదు బిఆర్ఎస్ హయాంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగింది అని ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఆరోపించారు...తీవ్ర విమర్శలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ తో కమిటీ వేశారు.
ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా ఇంత వరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. చివరకు పేదలకు ఇచ్చే గొర్రెల పంపిణీ తో పాటు వైద్య శాఖ కొనుగోళ్లలో కూడా భారీ భారీ స్కాం లు జరిగినట్లు గుర్తించారు. వైద్య శాఖ కొనుగోళ్ల స్కాం లో అయితే అప్పటి సీఎంఓ లో పని చేసిన ఒక కీలక అధికారి తనయుడే భారీ అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. అయినా సరే రేవంత్ రెడ్డి సర్కారు నుంచి ఎలాంటి చర్యలు లేవు. అన్నీ గుట్టుగా అటకెక్కుతున్నాయే తప్ప ఒక్క అంశంలో కూడా నిర్దిష్ట చర్యలు మాత్రం లేవు. దీంతోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయతపై ఎన్నో అనుమానాలు వ్యర్థం అవుతున్నాయి.



