హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు
తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు అదనపు బాధ్యతలు వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసీఆర్ చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలు ఇకపై హరీష్ రావు చూడనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను తప్పించిన తర్వాత ఆ శాఖ బాద్యతలను కెసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ శాఖ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారు. అయితే కెసీఆర్ తెలంగాణ సీఎం అయిన తర్వాత ఈ శాఖ బాధ్యతలు చూసిన వారంతా చిక్కుల్లో పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖను చూసిన మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య తన పదవిని మధ్యలోనే కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ శాఖ బాద్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్ దీ అదే పరిస్థితి.
మరి ఇప్పుడు హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించటంతో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతున్నది అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా హరీష్ రావుకు అప్పగించిన కీలక రాజకీయ టాస్క్ లు అన్నీ విఫలం అవుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతోపాటు...హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను ఆయనే స్వయంగా చూసుకున్నా సానుకూల ఫలితాలు సాధించటంలో విఫలం అయ్యారు. దీంతో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్ స్టార్ట్ కాబోతుంది అంటూ వ్యాఖ్యలు విన్పించాయి. ఈ తరుణంలో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించటం చర్చనీయాంశంగా మారింది.