Telugu Gateway
Telangana

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్..ఈ సారి ఈడీ వంతు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్..ఈ సారి ఈడీ వంతు
X

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నాడు దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వ‌హించారు. ఆరు రాష్ట్రాలు..30 ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రిగాయి. హైద‌రాబాద్ లోనూ ప‌లువురు ఇళ్ళ‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లో అభిషేక్ రెడ్డి, సృజన్ రెడ్డి, ప్రేమ్ సాగ‌ర్ ఇళ్ళ‌లో త‌నిఖీలు సాగుతున్నాయి. ఢిల్లీకి చెందిన బిజెపి నేత‌లు ఈ స్కామ్ లో సంచ‌ల‌నంగా సీఎం కెసీఆర్ కుమార్తె క‌విత పేరును తెర‌పైకి తీసుకొచ్చారు. దీనిపై సీబీఐ విచార‌ణ సాగుతుంద‌ని..విచార‌ణ‌లోనే నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో హైద‌రాబాద్ కేంద్రంగా ఈ విచార‌ణ‌ల సాగ‌టంతో ఈ వ్య‌వ‌హారంపై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. మ‌రి ఈ విచార‌ణ‌లో ఎలాంటి సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయో వేచిచూడాల్సిందే.

సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగానే ఈ త‌నిఖీలు సాగుతున్నాయి. హైద‌రాబాబాద్ తో పాటు ఢిల్లీ, లక్నో, గురుగావ్‌, బెంగళూరు, చెన్న‌య్ ల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది.వ్యాపారవేత్త రామచంద్రన్‌పిళ్లైతో సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాబిన్‌ డిస్టిలర్స్‌ పేరుతో రామచంద్రన్‌ పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు.బెంగళూరుతోపాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. రామచంద్రన్‌కు చెందిన ప్రధాన కార్యాలయంతోపాటు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఈడీ దాడుల‌పై ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ విచార‌ణ‌లో ఏమీ దొర‌క‌లేదు..ఇందులోనూ ఏమీ దొర‌క‌వ‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it