Telugu Gateway
Politics

ఏపీలోబిజెపి వ‌ర్సెస్ వైసీపీ

ఏపీలోబిజెపి వ‌ర్సెస్ వైసీపీ
X

ప‌న్నుల పెంపు వ్య‌వ‌హారంలో ఏపీలో రాజకీయంగా కొత్త పంచాయ‌తీ తెచ్చిపెట్టింది. ఈ అంశంపై అధికార వైసీపీ, బిజెపిలు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఏపిలో పన్నుల భారానికి కేంద్రానికి సంబంధం లేద‌న్నారు. సంస్కరణలపై 15 వ ఆర్ధిక సంఘం సూచనలే చేసింది...నిర్ణయం రాష్ట్రాలదేన‌ని తేల్చిచెప్పారు. కేంద్రం వల్లనే పన్నుల పెంపు జరిగితే ఇతర రాష్ట్రాల్లో పన్నులు ఎందుకు పెరగలేద‌ని జీవీఎల్ ప్ర‌శ్నించారు. జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు అని జగన్ కొత్త పథకం పెట్టుకోవాల‌ని ఎద్దేవా చేశారు. వైసిపి మంత్రులు తప్పుడు ప్రచారంపై క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏపీలో కొత్త పన్నుల‌ విధానం కారణంగా ప్రజలపై వేల కోట్లు భారం ప‌డుతుంద‌ని, అన్నీ కేంద్రం చెపితే చేస్తున్నాం అని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని జీవీఎల్ విమ‌ర్శించారు.

బిజెపి నేత‌ల వ్యాఖ్య‌ల‌ను ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌ప్పుప‌ట్టారు. బిజెపి నేత‌లు త‌మ‌కు నీతులు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మండిప‌డ్డారు. కేంద్రం సూచ‌న‌ల మేరకే ఆస్తి ప‌న్ను విధానంలో మార్పులు చేశామ‌న్నారు. ఆస్తి ప‌న్ను పెంపు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 15 శాతానికి మించద‌ని బొత్స తెలిపారు. ఇంటి అద్దెల‌కు సంబంధించి కూడా పార‌ద‌ర్శ‌క విధానం తెస్తున్నామ‌ని బొత్స వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు ఓ వైపు క‌రోనా కార‌ణంగా నానా తిప్ప‌లు ప‌డుతుంటే ప్ర‌భుత్వం ప‌న్నులు పెంచుకుంటూ పోతోంద‌ని బిజెపి విమ‌ర్శించింది.

Next Story
Share it