గెలుపు నాడి అందాక కూడా వైసీపీని పీకె టీమ్ నడిపించాలా?
కేబినెట్ లో జగన్ పీకె టీమ్ అంశాన్ని ప్రస్తావించారా?
వచ్చే ఏడాది ఎంట్రీ ఇస్తుందంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు
ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ నిజంగానే ఈ ప్రస్తావన చేశారా?. గెలుపు నాడి అందిన తర్వాత కూడా మళ్లీ విజయతీరాలకు చేరాలంటే ఇంకా వైసీపీకి పీకె టీమ్ సాయం కావాలా?. నిజంగా జగన్ ఈ మాట అని ఉంటే పార్టీ నేతలకు..క్యాడర్ కు ఇది ఎలాంటి సంకేతం పంపుతుంది. వచ్చే ఏడాది పీకె టీమ్ రంగంలోకి వస్తుందని సీఎం జగన్ మంత్రులతో వ్యాఖ్యానించినట్లు ఓ అస్మదీయ ఛానల్ వార్తను ప్రసారం చేసింది. అసలు దేశంలోనే ఏపీ చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ చేపట్టలేదని..కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు తాము ముందు చెప్పినట్లుగానే లక్ష కోట్ల రూపాయలకుపైనే నగదు బదిలీ చేసినట్లు వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇతర కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా..జగన్ మాత్రం మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు నగదు బదిలీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఏపీలో పంచుడు పథకాలు తప్ప..ఇతర ప్రగతి ఏమీలేదనే విమర్శలూ ఉన్నాయి. గురువారం నాడు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్ మంత్రులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పీకె టీమ్ వ్యవహరాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు..త్వరలో జరగనున్న మంత్రివర్గ మార్పులకు సంబంధించి కూడా కీలక సంకేతాలు ఇచ్చారు. కొత్త టీమ్ ను ప్రభుత్వంలోకి తీసుకుని ప్రస్తుత టీమ్ లోని చాలా మందిని ఎన్నికల టీమ్ గామార్చనున్నారు. నిజంగానే సీఎం జగన్ మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారా?. మరి అలా చేసేలా అయితే మరి ఇంకా పీకె టీమ్ ఎందుకు?. సీఎం జగన్ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలుపునకు మంత్రులు..ఎమ్మెల్యేల కంటే తన సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకుంటున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అందుకే ఎవరి ప్రమేయం లేకుండా ఆయనే నేరుగా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి నిధులు పంపిస్తున్నారన్నారు.
మళ్ళీ గెలిచినా కూడా తన ఇమేజ్ తోనే గెలిచినట్లు నిరూపించుకోవాలన్నది జగన్ వ్యూహంగా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ దిశగానే ఆయన పనులు సాగుతున్నాయని తెలిపారు. సహజంగా ప్రతిపక్షంలో ఉండగా పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తాయి. అలా అని ఖచ్చితమైన నిబంధనలు ఏమీ లేవు కానీ...ఎక్కువ శాతం ప్రతిపక్షంలో ఉన్న వారే వీరిపై ఆధారపడుతుంటారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సీఎంగా ఉండి కూడా మమతా బెనర్జీ కూడా పీకె టీమ్ సేవలు తీసుకుని విజయం సాధించారు. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కూడా పీకెను సలహాదారుగా నియమించుకున్నా ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఏపీది ప్రత్యేక పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా సాగింది నగదు బదిలీనే. దీన్ని వైసీపీ నమ్ముకుంది. అలాంటిది మళ్లీ ఇప్పుడు పీకె టీమ్ ఎంట్రీ ఇస్తారని సీఎం జగన్ ప్రకటిస్తే ఇది రాజకీయంగా అత్యంత ఆసక్తికర పరిణామంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంతో పోలిస్తే వనరులపరంగా..అధికార యంత్రాంగం పరంగా కూడా ఎన్నో సానుకూలతలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే.