Telugu Gateway
Politics

వైసీపీ పార్ల‌మెంట్ ఏజెండా ఫిక్స్

వైసీపీ పార్ల‌మెంట్ ఏజెండా ఫిక్స్
X

పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీకి సంబంధించి ఏయే అంశాల‌ను లేవ‌నెత్తాల‌నే అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. గురువారం నాడు తాడేప‌ల్లిలో ఆయ‌న అధ్య‌క్షత‌న జ‌రిగిన స‌మావేశానికి లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. స‌మావేశం అనంత‌రం పార్ల‌మెంట‌రీ పార్టీ నాయకుడు విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని తెలిపారు. పోలవరం సవరించిన అంచనాల తోపాటు పోలవరం ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల అంశాన్నికూడా లేవనెత్తుతామని తెలిపారు.

తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, కేఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి 6,112 కోట్ల రూపాయ‌ల విద్యుత్‌ బకాయిలు రావాలన్నారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాంమని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు. ట్రైబల్‌ యూనివర్శిటీని నాన్‌ట్రైబల్‌ ఏరియాలో కేటాయించారని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామని, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Next Story
Share it