టార్గెట్ రఘురామరాజు...ప్రధాని, రాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు గత కొంత కాలంగా ఏపీ సర్కారుకు చికాకులు పెడుతున్నారు. అంతే కాదు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ వేయటంతో పాటు.ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై కూడా ఆయన వరస పెట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రఘురామక్రిష్ణంరాజుపై ఏపీ సర్కారు రాజద్రోహం కేసు పెట్టడం..అరెస్ట్ చేయటం.. ఆ తర్వాత సుప్రీంలో బెయిల్ అంతా తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీలు రఘురామక్రిష్ణంరాజుకు చెందిన కంపెనీ బ్యాంకులకు చేసిన మోసంపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీలకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ ఎంపీల సంతకాలతో ఈ ఫిర్యాదు చేశారు. తీవ్రమైన ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్,ఇంద్ భారత్ పవర్ ఇన్‌ఫ్రా, ఆర్కే ఎనర్జీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇంద్ భారత్ కంపెనీలు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాయని, రూ.941.71 కోట్ల రూపాయాల ప్రజాధనం స్వాహా చేశారని'' ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకుని నిధులను పక్కదారి పట్టించారు. ఎస్‌బీఐ నుంచి రూ.63.46 కోట్లు తీసుకుని ఎగ్గొట్టారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదు. దీని వల్ల ప్రజలకు సంస్థలపై ఉన్న నమ్మకం పోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఇంద్ భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని'' లేఖలో కోరారు. ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలి. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలి. రూ.వేల కోట్ల ప్రజధనాన్ని కాపాడాలని లేఖలో వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. విజయ్ మాల్యా లాంటి ఎపిసోడ్ రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంద్ భారత్ బాధిత సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయన్నారు. అదే సమయంలో రఘురామరాజుపై చర్య తీసుకోవాలంటూ పార్లమెంట్ ప్లకార్డులతో వైసీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు.