పెద్దిరెడ్డికి రోజా ఫిర్యాదు
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి బెడద తప్పటం లేదు. తాజాగా కూడా ఎంపీపీ ఎన్నిక విషయంలో రాజకీయంగా అక్కడ రచ్చ సాగుతోంది. ఇదే అంశంపై ఆదివారం నాడు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. నిండ్ర ఎంపీపీ ఎన్నిక వివాదం ఎంతకూ ఓ కొలిక్కి రావటంలేదు. పెద్ది రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రోజా వివాదానికి కారణమైన చక్రపాణి రెడ్డి వర్గంపై ఫిర్యాదు చేశారు. చక్రపాణి రెడ్డితో సహా ఆయన వర్గానికి చెందిన ఎంపీటీసీలను, ఇతర నాయకులను సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో గ్రూపు రాజకీయాలు చేయడమంటే అధినేత జగన్ మాటను ధిక్కరించడమేనని ఎమ్మెల్యే రోజా అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలతో చేతులు కలిపి పార్టీ పరువుతీయడానికి రోడ్డుపై ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. విప్‌ను ధిక్కరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, అధికారులను బూతులు తిడుతున్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోజా కోరారు. తన గెలుపునకు సహకరించానని చక్రపాణి రెడ్డి చెప్పుకోవటం హస్యాస్పదంగా ఉందన్నారు.