Telugu Gateway
Politics

బాలినేని అనుచ‌రుడిపై సొంత పార్టీ నేత‌లే దాడి

బాలినేని అనుచ‌రుడిపై సొంత  పార్టీ నేత‌లే దాడి
X

సొంత పార్టీని విమ‌ర్శించాడ‌ని వైసీపీ నేత ఓ లాడ్జీలో ఉంటే వెతికి మ‌రీ కొట్టారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత సుబ్బారావు ఓ బ‌హిరంగ వేదిక‌పై మాట్లాడుతూ కొంత మంది నేత‌ల వ‌ల్ల పార్టీకి నష్టం జ‌రుగుతుంద‌ని..ఈ విష‌యం ఇప్పుడు ఇలా చెప్పొచ్చో తెలియదు కానీ..పార్టీ మంచి కోస‌మే ఇలా చెబుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఆయ‌న ప్ర‌ధానంగా కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జ‌రుగుతోంద‌ని అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు వీరు పార్టీ మేలు కోరేవాళ్లో...కోవ‌ర్టులో అర్ధం కావ‌టంలేదంటూ మాట్లాడారు. ఈ వీడియో అప్ప‌ట్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో ఆగ్ర‌హించిన పార్టీ నాయ‌కులు కొంత మంది ఓ లాడ్జిలో తలదాచుకున్న సుబ్బారావుపై మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ తన టీమ్ తో పాటు వెళ్లి దాడి చేశాడు. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి వీడియో తీశారు. గుప్తాపై సుభానీ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో విప‌రీతంగా స‌ర్కులేట్ అయింది. ఈ వ్య‌వ‌హారం దుమారం రేప‌టంతో మంత్రి బాలినేని కూడా స్పందించారు. పార్టీలో ఉండి విమర్శించడంతో నా అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి తమ వాళ్లకు ఆగమని చెప్పానన్నారు. 'దాడిని వారించే ప్రయత్నం చేశాను. నా మెంటాల్టీ ఏంటో ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు.

తన భర్త మతిస్థిమితం లేదని గుప్తా భార్యే చెప్పింది. మతిస్థిమితం లేకే గుప్తా ఆ రోజు సభలో ఆ వ్యాఖ్యలు చేశారు. భార్యే మతిస్థినితం లేదన్న వ్యక్తి కామెంట్లపై నేనేం మాట్లాడాలి. కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపాను. ఒంగోల్లో టీడీపీ నేతలను కూడా నేను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. నాది ఆ సంస్కృతి కాదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముకుంటూ ఉంటారు. అన్ని పార్టీల నేతలతోనూ గుప్తాకు పరిచయం ఉంది. గుప్తాకు నాతో ఎక్కువగానే పరిచయం ఉన్న మాట వాస్తవమే. గుప్తాతో ఎవరైనా ఈ మాటలు అన్పించారా అనే అనుమానం ఉంది. గుప్తా వ్యాఖ్యల వెనుక టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చు. టెండర్ వేశారని సొంత పార్టీ నేతనే కొట్టిన చరిత్ర దామచర్లకు ఉంది. ఆడవారిని విమర్శించడాన్ని ఎవ‌రూ ప్రొత్సహించరు. ఏ పార్టీ వారైనా ఇంట్లో మహిళల గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తప్పే. ఆ రోజు సభలో సీఎం కూడా లేరు. షర్మిల గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ వాళ్లేమయ్యారు.'' అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.

Next Story
Share it