Telugu Gateway
Politics

కోటంరెడ్డి కి ఒక న్యాయం..ఆనం కు ఒక న్యాయమా?!

కోటంరెడ్డి కి ఒక న్యాయం..ఆనం కు ఒక న్యాయమా?!
X

అధికార వైసీపీ లో కలకలం. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్ల విషయంలో ఎందుకో పెద్ద సానుకూలంగా లేరు. అందులో ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు...ఇందులో ధర్మాన ప్రసాద రావు కూడా ఉన్నారు.. అందుకే సీనియర్ నేతగా ఉన్న ఆయనకు తొలిసారి మంత్రివర్గం లో చోటు దక్కలేదు. అయన సోదరుడు ధర్మాన క్రిష్ణదాస్ కు ఛాన్స్ దక్కింది. చాలా రోజులు అసలు ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉంటూ వచ్చారు తర్వాత మంత్రి పదవి దక్కాక ఫుల్ ఆక్టివేట్ అయ్యారు. జగన్ మొదటినుంచి పూర్తిగా తన వర్గం పైనే అంటే కేవలం తన పట్ల వంద శాతం విశ్వాసంగా ఉన్న వాళ్లనే పట్టించుకుంటూ పోతున్నారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్ కోర్ టీం జాబితాలోనే ఉంటారు. అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు..పైగా పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వటం లేదు. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వ తీరు..ముఖ్యంగా అధికారులపై విమర్శలు చేస్తూవస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తి గళాన్ని వినిపిస్తుండంతో ఆయన్ను పిలిపించి మాట్లాడిన సీఎం జగన్..సీనియర్ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరించారు.

అంటే తన వాళ్ళు అయితే ఒక రకంగా. పార్టీలో ఉన్న ఇతరుల విషయంలో అయితే మరో లాగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ సాగుతోంది ఆ పార్టీ నేతల్లో. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది అని చెపుతున్నారు. ప్రభుత్వంపై ఆనం ఇటీవల ఘాటు విమర్శలు చేస్తుండంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్యే ఆనంను తొలగించారు. వెంకటగిరి ఇన్‌ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించారు. ఇన్‌ఛార్జిల మార్పుపై వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఛార్జిగా తొలగించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆనం కు టికెట్ ఉండనే సంకేతాలు ఇచ్చేసారు అని చెపుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రామ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలను పాటించాలని స్థానిక అధికారులకు పార్టీ ముఖ్యనేతలు ఆదేశించినట్టు చెపుతున్నారు.

Next Story
Share it