Telugu Gateway
Politics

అది కీలుబొమ్మ కేబినెట్...ఇది ఛాయ్, బిస్కెట్ కేబినెట్

అది కీలుబొమ్మ కేబినెట్...ఇది ఛాయ్, బిస్కెట్ కేబినెట్
X

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామకృష్ణుడు ఏపీ నూత‌న కేబినెట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మంత్రివ‌ర్గం కీలుబొమ్మ కేబినెట్ అయితే..ఇప్ప‌టిది ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అని ఎద్దేవా చేశారు. ఆయ‌న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. సీఎం కిచెన్ కేబినెట్‌లోనూ, సలహదారుల బృందంలోనూ బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆరోపించారు. ప్రాధాన్యత, పెత్తనంలేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారన్నారు.

టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యమే కాదు.. ప్రాధాన్యత కూడా వచ్చిందని యనమల అన్నారు. సజ్జల ఎవరు? సీఎం సన్నిహితుడైతే మంత్రులను డిక్టేట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కేబినెట్‌లో బీసీలు ఉండాలి కాబట్టి.. ఇస్తున్నారని అన్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల వ్య‌తిరేక‌త‌ ఉందని, అందుకే పార్టీలో కూడా కొంత మంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి లొంగక తప్పలేదన్నారు. వైసీపీలో అసంతృప్తి మొదలైందని.. జగన్‌పై తిరగబడుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా అర్ధమవుతోందని యనమల వ్యాఖ్యానించారు.

Next Story
Share it