వైఎస్ షర్మిల ఓటర్ కార్డు..ఆధార్ కార్డు ఎక్కడ?
ఇక ప్రజలే మేనిఫెస్టో ఖరారు చేస్తారు...పార్టీలు అమలు చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన తీన్మార్ మల్లన్న పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరోనా సమస్య ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆగస్టు 29 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల పాటు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఇంత కాలం పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయని..ఇక రాబోయే రోజుల్లో ప్రజలే పార్టీల మేనిఫెస్టోలను నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు 40 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా చేసేందుకు ఏ పార్టీ ముందుకు వస్తుందో చెప్పాలని అన్ని పార్టీల ను డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలను తాము ప్రజలుగానే చూస్తాం తప్ప..పార్టీల వారీగా చూడమన్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తకు, టీఆర్ఎస్ కార్యకర్తకు కష్టం వచ్చినా తమ టీమ్ అండగా నిలుస్తుందని తెలిపారు. చాలా మంది ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రకు రెడీ అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
అదే సమయంలో రాజన్న బిడ్డ షర్మిల కూడా పాదయాత్రకు రెడీ అయ్యారంటూ.. ఆమె గత ఎన్నికల్లో ఓటు ఎక్కడ వేసింది...ఆమె ఆధార్ కార్డు ఎక్కడుంది అని ప్రశ్నించారు. తనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఆఫర్ చేసినా వద్దన్నట్లు తెలిపారు. తాము పలు రాష్ట్రాల్లో ఎన్నికల తీరును పరిశీలించామని..కేరళలో ఎన్నికల్లో పోటీ చేసేవారు ఓటర్లకు దండం పెట్టరని..వాల్ పోస్టర్ పై కూడా వాళ్ళ ఫ్రొపైల్ , అర్హతలు ఉంటాయన్నారు. పీహెచ్ డీ చేసిన వ్యక్తే విద్యా శాఖ మంత్రి కావాలన్నారు. ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమీకాదన్నారు. తీన్మార్ మల్లన్న ఆదివారం నాడు తన టీమ్ లోని కీలక సభ్యులతో సమావేశం అయిన సందర్భంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.