Telugu Gateway
Politics

ఏపీలో పార్టీపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో పార్టీపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

వైఎస్ ష‌ర్మిల ఏపీలో కూడా పార్టీ పెట్టే అవ‌కాశం ఉందంటూ ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇదే అంశంపై సోమ‌వారం నాడు మీడియా ప్ర‌తినిధులు ష‌ర్మిల‌ను అడ‌గ్గా..ఏపీలో పార్టీ పెట్ట‌కూడ‌ద‌ని రూల్ ఏమీ లేదు కదా అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ పార్టీ ఎక్క‌డైనా పెట్టొచ్చ‌న్నారు. అయినా తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామ‌ని తెలిపారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. వైఎస్ జ‌గ‌న్, వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల‌కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విభేదాలు త‌లెత్తాయ‌ని ప్ర‌ముఖంగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను అటు ష‌ర్మిల వైపు నుంచి కానీ..ఇటు జ‌గ‌న్ క్యాంప్ నుంచి కూడా ఎలాంటి స్పంద‌న రాలేదు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెరుగుతుంద‌నే సంకేతాలు క‌న్పిస్తున్నాయి.

వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియా వేదిక‌గానే స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఆమె ఏపీపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆమె ప్ర‌స్తుతానికి తెలంగాణ‌పైనే ఫోక‌స్ పెట్టారు. ఏపీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాలంటే ఆమె ఇప్పుడు పార్టీ పేరును కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె పార్టీ పేరులోనే తెలంగాణ పేరు పెట్టుకున్నారు. మ‌రి తెలంగాణ పేరు పెట్టుకుని ఏపీలో పోటీ చేయ‌టం సాధ్యం అవుతుందా?. సాంకేతికంగా స‌మ‌స్య‌లు ఉండ‌క‌పోవ‌చ్చు కానీ..ప్రాంతీయ అంశాలు త‌లెత్త‌టం ఖాయం.

Next Story
Share it