Telugu Gateway
Politics

దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి..లేదంటే నోరుమూసుకోవాలి

దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి..లేదంటే నోరుమూసుకోవాలి
X

కెసీఆర్ ఎడమ కాలి చెప్పుకింద తెలంగాణ ఆత్మగౌరవం

జులై8న పార్టీ పేరు..ఏజెండా వెల్లడి

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం 'సంకల్పసభ'లో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆమె అధికార టీఆర్ఎస్ నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కాంగ్రెస్, బిజెపిలపై కూడా విసుర్లు విసిరారు. సింహం సింగిల్ గానే వస్తుందని వ్యాఖ్యానించారు. 'మేం టీఆర్ఎస్ చెపితే, బిజెపి అడిగితే రాలేదు. కాంగ్రెస్ పంపితే రాలేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమే వస్తున్నా.' అంటూ తమ వెనక ఎవరూ లేరని ఖమ్మం సభా వేదిక నుంచి షర్మిల తెలంగాణ ప్రజలకు సంకేతాలు పంపారు. అత్మగౌరవ నినాదంతో సాగిన తెలంగాణలో ఇఫ్పుడు అది ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. 'తెలంగాణ అత్మగౌరవం దొరగారి ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతుంది. ఉద్యమం కోసం అందరినీ వాడుకున్నారు. పాలన లో చూస్తే అంతా దొరగారి బంధుగణమే. అంతా భజన బ్యాచే. సీఎం కెసీఆర్ సెక్రటేరియట్ కు రాడు.

అసలు దేశంలోనే సెక్రటేరియట్ రాని ఏకైక సీఎం ఉన్నది తెలంగాణలోనే. రాష్ట్ర సాధన ఫలితాలు ప్రగతి భవన్ దాటి బయటకు రావటం లేదు. బంగారు తెలంగాణ సాధ్యం అయిందా? కల్వకుంట్ల ప్యామిలీకి రాష్ట్రం బానిస అయిందా?.ఏదైనా దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి. లేదంటే నోరు ముసూసుకోవాలి అన్నట్లు ఉంది పరిస్థితి. దొర చెప్పిందే వేదం. దొర పంది అంటే పంది. నంది అంటే నంది. దొరా బాంచెన్ అంటూ సాగిలపడితేనే రాజకీయ భవిష్యత్. మరి ప్రశ్నించేవాడు ఎవడు?. కెసీఆర్ ఎన్నికల ముందు ఒకలా..అయిపోయాక మరోలా మాట్లాడతాడు. అయినా నిలబెట్టుకోలేని హామీల గురించి కాంరెస్ పార్టీ నిలదీయదు. తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలను సప్లయ్ చేసే కంపెనీగా మారింది. కాంగ్రెస్ అమ్ముడుపోయింది కాబట్టి మాట్లాడదు. బిజెపి మతతత్వం గురించే మాట్లాడుతుంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ , పసుపు బోర్డు ఇస్తాం అన్నారు..ఇచ్చారా? . అన్ని పార్టీలు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారు.

అన్నీ ఒకే తాను ముక్కేలే. అందుకే ప్రజల గొంతుకై ప్రశ్నించే పార్టీగా రాబోతున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా నేను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే. ఈ గాలి పీల్చుకున్నా. ఇక్కడే పెరగిగా. ఈ గడ్డ మీదే నా కొడుకు..కూతురిని కన్నా.. ఈ గడ్డ మీదే బతికా. ఈ గడ్డ రుణం తీరుచకోవాలనుకోవటం తప్పా. బరాబర్ తెలంగాణలో నిలబడతాం. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. పదవులు వచ్చినా రాకపోయినా నిలబడతా. అవకాశం ఇవ్వాలో వద్దో ప్రజలు నిర్ణయిస్తారు. . ఇస్తే పని చేస్తా. లేకపోతే వారి తరపునే పోరాటం చేస్తాం.మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా తెలంగాణ ప్రజల కోసమే..రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. చిత్తుశ్ధుద్ధితో పనిచేస్తుందని హామీ ఇస్తున్నాను. ఎక్కడ అవసరం అయితే ..అక్కడ గొంతెత్తుతాం తెలంగాణ ప్రజల ఆంకాంక్ష్ల మేరకు పనిచేస్తాం.

తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టునూ వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టును అయినా అడ్డుకుంటాం. నేను పెట్టబోయేది తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఈ సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. మా పార్టీ కార్యకర్తలకు నేను చెప్పే మాట ఇదే . నేటి కార్యకర్తే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు...వారి డబ్బుకు...మదానికి భయపడొద్దు. ప్రజల తరపున నిలబడి పోరాటం చేయండి. మీకు ఏదైనా కష్టం వస్తే నేను అండగా నిలబడతా.' అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. తమ కొత్త పార్టీ పేరు, విధివిధానాలను జులై8న ప్రకటిస్తామని తెలిపారు. అదే సమయంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం షర్మిల తానే స్వయంగా నిరాహారదీక్షకు దిగనున్నట్లు తెలిపారు.

Next Story
Share it