ఏడాది పాటు వై ఎస్ షర్మిల పాదయాత్ర
తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధం అయింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ షర్మిల అక్టోబర్ 20 నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నారు. చేవేళ్లలో ప్రారంభం అయ్యే ఈ యాత్ర అక్కడే ముగుస్తుందని తెలిపారు. తన పాదయాత్ర వివరాలను వైఎస్ షర్మిల సోమవారం నాడు వెల్లడించారు. దీనికి ప్రజా ప్రస్థాన యాత్ర అని పేరు పేరు పెట్టారు. జీహెచ్ ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పాదయాత్ర ఉంటుందని..ఇది 90 నియోజకవర్గాల్లో కవర్ అవుతుందని తెలిపారు. ఏడాది పాటు ఇది సాగనుంది. పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్ అని, . ఆయన పాదయాత్ర నుంచి పుట్టినవే ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఉచిత విద్యుత్ , కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న జలయజ్ఞం అని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రలో సమస్యలు వినడం, తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కూడా పాదయాత్ర ఉద్దేశం. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వారికి అండగా నిలబడతామన్నారు. గత ఏడేళ్ళ కేసీఆర్ పాలనలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేవలం 3లక్షల మందికే మాఫీ చేసి, 30లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు.
తెలంగాణలో 91శాతం మంది రైతులకు కనీసం రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. ఈ లెక్కన రైతులందరూ అప్పులపాలయ్యారు. రాష్ట్రంలో 16లక్షల కౌలు రైతులు దిక్కులేకుండా పోయారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వాలు దళితులకు కేటాయించిన అసైన్డు భూములు, పోడు భూములు లాక్కున్నారు. కేసీఆర్ పాలనలో దళితుల మీద దాడులు 800 శాతం పెరిగాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగితే.. మహిళలపై దాడులు 300 శాతం పెరిగాయి. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నారు. . రాష్ట్రంలో చిన్న పిల్లల మానప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దీనికి కారణం మద్యం, డ్రగ్స్, గంజాయి. తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయి అమ్ముడుపోతున్నా, కేసీఆర్ వీటిని అరికట్టడానికి ఏ చర్యా తీసుకోవడం లేదు. బంగారు తెలంగాణ అని చెప్పి, బీరుల తెలంగాణ, బారుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు.