Telugu Gateway
Politics

ఆమె తాజా నిర్ణయంతో పలు అనుమానాలు

ఆమె తాజా నిర్ణయంతో పలు అనుమానాలు
X

ఎవరు ఎక్కడ అయినా పార్టీ పెట్టుకోవచ్చు...ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు. ఏ పార్టీలకు అధికారం ఇవ్వాలి..ఎవరిని పక్కన పెట్టాలి అని నిర్ణయించేది ప్రజలే. అయితే పైకి ఎన్ని చెప్పుకున్నా పార్టీ పెట్టినవారికి...అక్కడ ఉన్న వారికి వాస్తవ పరిస్థితులపై కొంత క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ లేని వాళ్ళు రాజకీయాల్లోనే ఉండరు. ఈ విషయాలు అన్నీ పక్కన పెట్టి ఎవరైనా పనిచేస్తున్నారు అంటే వాళ్లకు ఏదో రహస్య ఎజెండా ఉంది అనే అనుమానాలు రావటం కూడా సహజం. తెలంగాణాలో పార్టీ పెట్టి, పాదయాత్ర చేసిన షర్మిల కొద్దినెలలుగా పార్టీ కార్యకలాపాల వేగం తగ్గించారు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం దిశగా చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో కూడా సమావేశం అయ్యారు. అంతకంటే ముందే కర్ణాటక పీసిసి ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ కె శివ కుమార్ తో పలు దఫాలు చర్చలు జరిపారు . ఆ సమయంలోనే ఆమెకు కర్ణాటక నుంచి రాజ్య సభ సీటు కూడా ఆఫర్ చేసినట్లు బాగా ప్రచారం జరిగింది. వాటిని ఎక్కడా షర్మిల ఖండించలేదు కూడా. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టమని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినా సరే షర్మిల తన రాజకీయ క్షేత్రం తెలంగాణ మాత్రమే అంటూ ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు...ఇప్పుడు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ టి పీ సొంతగా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకునే ఛాన్స్ లేదు. అయినా సరే ఇక్కడ నుంచే షర్మిల బరిలో ఉంటామన్నారు. ఆమెతో తల్లి పాటు విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని షర్మిల తెలిపారు. షర్మిల తెలంగాణాలో తన అభ్యర్థులను బరిలో నిలపటం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అంటూ జరిగితే అది కాంగ్రెస్ పార్టీకే అని అందరికి తెలిసిందే.

ఎందుకంటే వై ఎస్ అభిమానులు కొంత మంది ఓటు వేసినా కాంగ్రెస్ కు రావాల్సిన ఓట్లు అటు వైపు వెళ్ళినట్లే. రాజ్య సభ ఆఫర్, ఆంధ్ర ప్రదేశ్ పీసిసి పదవి వంటి వాటిని షర్మిల వదులు కున్నారు అంటే దీని వెనక ఏదో బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ కూడా సాగుతోంది. నిజంగా షర్మిల కు జగన్ తో విబేధాలు ఉండి ఉంటే ఆమె కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించే వారు కాదు అని...ఎందుకంటే ఇప్పుడు దేశంలో కూడా ఆ పార్టీ గతంతో పోలిస్తే బలపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్న వేళ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇది ఎంతో కీలకం అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఓట్లు చీలితే అది కెసిఆర్ కే లాభం, మళ్ళీ బిఆర్ఆర్ పార్టీ వస్తుంది అని చెపుతూనే 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. పోనీ షర్మిల ఎన్నికలకు ముందు నుంచి రంగం సిద్ధం చేసుకుని ఈ మాట అని ఉంటే పెద్దగా ఎవరు ప్రశ్నించే వారు కాదు. కానీ చర్చలు విఫలం అయిన తర్వాత ఆమె ఈ మాటలు అనటంతోనే షర్మిలను ఏవో అదృశ్య శక్తులు నడిపిస్తున్నాయి అనే చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. నిజంగా గెలుపు దిశగా ఆలోచించే వాళ్ళు అయితే తమకు ఎక్కెడెక్కడ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో లెక్కలు వేసుకుని వాటిపైనే ఫోకస్ పెడతారు. కానీ షర్మిల అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో తామే అధికారంలోకి వస్తామని చెప్పుకునే బీజేపీ కే బలమైన అభ్యర్థులు కరువయ్యారు అని చెపుతున్నారు. అలాంటిది షర్మిలకు దొరికే అభ్యర్థులు ఎవరు...వాళ్ళు సాధించే ఓట్లు ఎన్ని అనేది ఎన్నికల తర్వాత కానీ తేలదు.

Next Story
Share it