కేసీఆర్ మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయి
రెండు గుంటల మనిషికి 400 కోట్లు ఎక్కడివి?
ఈటెల సంచలన వ్యాఖ్యల
కుట్రలు చేసేవారు వాటితోనే నాశనం అవుతారని..వారికి ఎలాంటి మంచి జరగదని హజూర్ బాద్ ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించిన ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. దమ్ము ఉంటే..ధైర్యం ఉంటే ఎవరినైనా అభ్యర్ధిని పెట్టండి..లేకపోతే మామ ఉంటడా, అల్లుడు ఉంటడా?. ఎవరు వచ్చినా వీరుడుగా కొట్లాడదమిన చెప్పినా. రాకపోగా వట్టి పోరడిని పెట్టి అణిచేస్తా అన్నారని వ్యాఖ్యానించారు. రెండు గుంటల మనిషికి 400 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అంత లిక్విడ్ క్యాష్ ను ఎట్లా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ బుధవారం నాడు కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.కేసీఆర్ అహంకారంపై ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని అన్నారు. 'ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారు. హుజూరాబాద్ ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారు. చివరకు హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారు. ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు.కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు.
అయినా ఎవరూ లొంగలేదు. మేము దళిత బస్తీలకు పోయినపుడు దళిత బంధుకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారు. మేం పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు నా వైపే నిలబడ్డారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. కేసీఆర్ మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయి. నేను పార్టీలు మారినవాడిని కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు, నా గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు. నాకు అండగా ఉన్న అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు' తెలిపారు ఈటెల. తాను పార్టీకి వెన్నుపోటు పొడవలేదని.వాళ్ళే తనకు వెన్నుపోటు పొడిచారన్నారు. నా బొమ్మ, నా పార్టీ గుర్తు, నా జెండాతో ఈటెల గెలిచారని కెసీఆర్ అహంకార పూరితంగా మాట్లాడారని విమర్శించారు. తాను గడ్డిపోచను కాను అనే విషయం వాళ్ళకు ఇప్పుడు తెలిసిందన్నారు.