కోమటిరెడ్డి మారారా...మారాల్సి వచ్చిందా?!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తత్వం బోధపడిందా. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బరిలో నిలబడి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయాక అయన కాంగ్రెస్ లో అయితేనే విజయం సాధించగలమని అర్ధం అయిందా. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా...అక్కడ కాంగ్రెస్ గెలవదు అని బహిరంగంగా ప్రకటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఒక్కసారిగా యాక్టీవ్ అయ్యారు. మునుగోడు ప్రచారం గురించి మీడియా అప్పటిలో ప్రశ్నలు వేస్తే ప్రచారానికి హోమ్ గార్డ్లు వెళ్లరని....ఎస్ పీ లే చూసుకుంటారని అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం షో కాజ్ నోటీసు జారీ చేసింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమి రిప్లై ఇచ్చారు...అన్న విషయం కూడా బయటకు రాలేదు. శుక్రవారం నాడు గాంధీ భవన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యక్షం అయి అటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తో సమావేశం అయి పలు సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు...పీసీసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో కూడా అయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికకు హోమ్ గార్డ్ అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఎన్నికలకు సూచనలు చేయటానికి అయన ఒక్కసారిగా డీజీపీగా మారిపోయారా అని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనే ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటటించాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి పార్టీ అధిష్టానం కూడా వివాదాలు లేని చోట సుమారు 60 సీట్లలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉందని..ఇప్పుడు ఈ ప్రకటన చేసి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవటానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు. తెలంగాణ లో బీజేపీ కి..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడం...తాజా పరిణామాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టీవ్ అయ్యారని...ఎన్నికల ముందు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. లేక పోతే ఆయనే స్టార్ కాంపైనర్ గా ఉండి..సొంత పార్టీ ఓడి పోతుంది అని బహిరంగంగా చెప్పి ఇప్పుడు మళ్ళీ అయనే తానే పార్టీ రక్షకుడిని అనే తరహాలో కలరింగ్ ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.