Telugu Gateway
Politics

కెసిఆర్ తీరుతో పెరుగుతున్న అనుమానాలు!

కెసిఆర్ తీరుతో పెరుగుతున్న అనుమానాలు!
X

బిఆర్ఎస్ ప్రెసిడెంట్, తెలంగాణ సీఎం కెసిఆర్ అంటే మాటల దాడికి పెట్టింది పేరు. ప్రతిపక్షంలోనే మాటల దాడికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ అధికారంలో ఉండి కూడా..ప్రతిపక్షాలపై విమర్శలు చేయటంలో కెసిఆర్ ముందు వరసలో ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇదే కెసిఆర్ ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను గోకుతూనే ఉంటా అంటూ ధ్వజమెత్తారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణాలో పర్యటించిన ప్రధాని మోడీ ఎవరూ ఊహించని స్థాయిలో సీఎం కెసిఆర్ పై విమర్శలు చేశారు. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఒకసారి కెసిఆర్ ఢిల్లీ కి వచ్చి తన సహజ శైలికి బిన్నంగా తనపై ఎక్కడ లేని ప్రేమ చూపించారు అని...తాము కూడా ఎన్ డిఏ ప్రభుత్వంలో చేరుతామని..తమ ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తుంది అని చెప్పినట్లు వెల్లడించారు. మరో సారి ఢిల్లీ కి వచ్చి తన కొడుకు కెటిఆర్ ను సీఎం చేద్దాం అనుకుంటున్నాను అని...దానికి తన ఆశీర్వాదం కోరినట్లు మోడీ బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాను సీఎం కావటానికి మోడీ అనుమతి అవసరమా అని...మంత్రి కెటిఆర్ తో పాటు ఇతర బిఆర్ఎస్ నేతలు వెంటనే మోడీ విమర్శలపై స్పందించారు. కానీ అప్పటి నుంచి బయటకు రాని కెసిఆర్ తాజాగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఎన్నికల సభల్లో అయినా కెసిఆర్ తనపై ప్రధాని మోడీ చేసిన సంచలన ఆరోపణలపై స్పందిస్తారేమో అని ఎక్కువ మంది భావించారు. కానీ కెసిఆర్ మాత్రం అసలు తనను మోడీ ఏమి అనలేదు అన్నట్లు...ఆయన తెలంగాణ కు వచ్చినట్లే తెలవదు అన్నట్లు వ్యవహరించటం విశేషం. గత కొంత కాలంగా బిఆర్ఎస్ , బీజేపీ లు ఒక్కటే అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా జరిగింది. ఈ కారణంతోనే ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్న కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా కెసిఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న ఎక్కడ బీజేపీ పై ఏ మాత్రం విమర్శలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నే టార్గెట్ చేసుకుంటూ వెళుతున్నారు. బండి సంజయ్ తో పోలిస్తే కొత్త తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పెద్దగా కెసిఆర్ పై విమర్శలు చేయటం లేదు అని అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఇవి అన్నీ చూస్తే నిజంగానే బిఆర్ఎస్, బీజేపీ ల మధ్య ఏదో తెర వెనక ఒప్పందాలు ఉన్నాయనే ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అని చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it