కెసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటానికీ కూడా అన్ని రోజులా?
తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ఓ దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు గురైంది. ఈ ఘటనపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మొదటి నుంచి సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆమె మధిర నియోజకవర్గానికి చెందిన మహిళ కావటంతో ఆయన మరింత సీరియస్ గా టేకప్ చేశారు. అయితే ఈ ఘటనపై శుక్రవారం నాడు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సారధ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కో్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు గవర్నర్ తమిళ్ సైని కలసి ఈ అంశంపై వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరికింది వీరికి. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పోలీసుల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈ ఘటనపై సమాచారం వస్తుంది. కానీ ప్రభుత్వపరంగా ఎవరూ దీనిపై స్పందించలేదు. కానీ ఘటన జరిగిన వారం తర్వాత ముఖ్యమంత్ర కెసీఆర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు..ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సహించబోదని ప్రకటించారు. అయిత ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ మాటలు కాంగ్రెస్ నేతలు కలవక ముందు అని ఉంటే..ఆ మేరకు ప్రకటన చేసి ఉంటే దానికి మరింత విలువ వచ్చేదని..అలా కాకుండా కాంగ్రెస్ నేతలు కలసిన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు పలు ఆదేశాలు జారీ చేయటంతో ఇది అంతా రాజకీయ రంగు పులుముకున్నట్లు అయిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు కలిశాక సీఎం కెసీఆర్ మరియమ్మ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం ప్రకటించటంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించటం అంతా ప్రభుత్వం నిజాయతీగా స్పందించినట్లు కాకుండా రాజజకీయ కోణంలో సాగినట్లే కన్పిస్తోందని అన్నారు. అంతే కాదు...ఇప్పడు డీజీపీని స్వయంగా చింతకాని వెళ్ళి లాకప్ డెత్ పూర్వాపరాలు తెలుసుకుని..బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించాలని ఆదేశించారు. ఇది అంతా కొత్తగా కొత్తగా ఉందని ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే లాకప్ డెత్ జరిగిన తర్వాత ఉన్నతాధికారులు ఇందుకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపిన దళిత మహిళ హత్య విషయంలో సీఎం కెసీఆర్ అంత ఆలశ్యంగా స్పందించటం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.