Telugu Gateway
Politics

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆరా..కెటీఆరా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆరా..కెటీఆరా?
X

వైఎస్ఆర్ టీపీ ప్రెసిడెంట్ వైఎస్ ష‌ర్మిళ తొలి మీడియా స‌మావేశంలోనే సీఎం కెసీఆర్..మంత్రి కెటీఆర్ ల‌పై వ్యంగాస్త్రాలు సంధించారు. అస‌లు కెటీఆర్ ఎవ‌రు? అంటూ..ఓహో ముఖ్యమంత్రి కెసీఆర్ కొడుకా అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు..అస‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆరా..లేక కెటీఆరా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా కెసీఆర్ అంటే గౌర‌వం ఉంద‌ని..కానీ సీఎం అయిన త‌ర్వాత కెసీఆర్ లోని దొర బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని అన్నారు. ఆయ‌న‌కు అస‌లు మ‌హిళ‌లు అంటే ఏ మాత్రం గౌర‌వం లేదన్నారు. కేసీఆర్ మహిళలను గౌరవించట్లేదు.. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ గౌరవిస్తారా..? అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలున్నారు..?. ఎంత మందిని పోటీలో నిలబెట్టారు..? ఎంతమందిని గెలిపించుకున్నారు..?. ఎంతమందిని మంత్రులను చేశారు..?. ఒక్క మహిళ అయినా మంత్రిగా ఉన్నారా..? ఉన్న వాళ్ల‌లో .. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది అని ప్ర‌శ్నించారు.

కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం' అని కేసీఆర్, కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల‌కు న్యాయం చేయాలనే పార్టీని స్థాపించాం. వైఎస్ఆర్ టీపీ నాకోసం పెట్టిన పార్టీ కాదు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే.. స్థాపించాం. కాంగ్రెస్‌ అమ్ముడుపోయిన పార్టీ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు అర్ధమే లేదు.ఇది ప‌గ‌లు..ప్ర‌తీకారం కోసం వచ్చిన ఎన్నిక‌న్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను' అని షర్మిల ప్ర‌క‌టించారు. కెసీఆర్ ఓ నియంత అని..ఎవ‌రూ త‌న‌ను ప్ర‌శ్నించ‌కూడ‌ద‌నుకుంటార‌న్నారు. రాసిపెట్టుకోండి తెలంగాణ‌లో సంచ‌ల‌నం ఖాయ‌మ‌న్నారు. జ‌గ‌న్ మీద‌ అలిగి పార్టీ పెట్టాన‌న‌టం స‌రికాద‌ని..అలిగితే మాట్లాడ‌టం మానేస్తారు కానీ పార్టీలు పెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ఏపీలో రాజ‌న్న రాజ్యం వ‌స్తున్న‌ట్లే క‌న్పిస్తోంద‌ని..రాక‌పోతే ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డ‌తార‌న్నారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే ఈ ప్రాంతంపై ప్రేమ లేన‌ట్లేనా అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it