మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధాని మోడీ, దేశానికి మధ్యే ఉంటాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..తనకు జ్యోతిష్యం తెలియదని..ఇలాంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితుల ప్రకారం ఉంటాయన్నారు. కరోనా కారణంగా దేశంలో ఎంతో మంది చనిపోయారని..దీనికి అసలు లెక్కలేలేవన్నారు. కొంత మంది శవాలను అంత్యక్రియలు నిర్వహించకుండా గంగానదిలో పడేశారని..ఈ విషయాలను ఆయా కుటుంబాల వారు ఎప్పటికి మర్చిపోరన్నారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతా ఢిల్లీలో వరస పెట్టి రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు.
ఆమె బుధవారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం కానున్నారు. తొలి రోజు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు వ్యాక్సిన్ల సరఫరా పెంచాలని కోరారు. కేంద్రంలోని మోడీ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటున్న వారిలో మమతా మొదటి వరసలో ఉన్నారు. తాజాగా ఆమె పెగాసెస్ స్పైవేర్ కు సంబంధించిన అంశంపై రాష్ట్రంలో ఓ కమిటీ వేసి సంచలనం నమోదు చేశారు. పెగాసెస్ అంశంపై ఆమె మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.