తెలంగాణలో లోక్ సభ సీట్లు అన్నీ గెలుస్తాం
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మజ్లిస్‌కు భయపడేది లేదని ఆయన ప్రకటించారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు. తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్ షా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్ ఇపుడు మరిచిపోయారన్నారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కెసీఆర్ కు పట్టవా అని ప్రశ్నించారు. బిజెపి మాత్రమే మజ్లిస్ తో పోరాడుతుందని వ్యాఖ్యానించారు.
మజ్లిస్ ను ఓడిస్తే తెలంగాణ ప్రజలకు అసలైన స్వేచ్చ దొరికినట్లు అన్నారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ను గెలిపించాలని అమిత్ షా కోరారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన పోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..సచివాలయానికి వచ్చే సీఎం కావాలనుకకుంటున్నారని తెలిపారు. బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ మాట్లాడుతూ విమోచన దినోత్సవాలు జరపని కెసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి జయజయద్వానాలు ప్రగతి భవన్ కు విన్పించాలన్నారు. తెలంగాణ విమోచన అమర వీరుల చరిత్ర తెలియజేసేందుకే నిర్మల్ లో సభ పెట్టినట్లు సంజయ్ తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రజలు కదిలి రావాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ పటేల్ లేకుండా తెలంగాణ పాకిస్తాన్ లో కలిసి ఉండేదని...కెసీఆర్ సీఎం అయ్యే వారు కాదన్నారు.. కెసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింని సంజయ్ వ్యాఖ్యానించారు.