Telugu Gateway
Politics

భూముల వేలాన్ని అడ్డుకుంటాం

భూముల వేలాన్ని అడ్డుకుంటాం
X

తెలంగాణ స‌ర్కారు త‌ల‌పెట్టిన భూముల అమ్మ‌కంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గ‌తంలో భూముల అమ్మ‌కాన్ని వ్య‌తిరేకించిన టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం భూముల అమ్మ‌కానికి రెడీ అయింద‌ని విమ‌ర్శించారు. ఆదివారం నాడు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అత్య‌వ‌స‌రంగా స‌మావేశం ఏర్పాటు చేసి భూముల విక్ర‌యం అంశంపై చ‌ర్చించారు. భూములు ప్రజల అవసరాల కోసం ఆస్తులు... అంతే కానీ అమ్మకానికి కాద‌న్నారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే కేసీఆర్ ప‌నిగా పెట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. భూముల అమ్మకానికి ఎవరూ రావొద్ద‌ని మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క కోరారు. ఎవ‌రైనా వ‌చ్చి కొనుగోలు చేసినా 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్ర‌జ‌ల‌కు ఇస్తుంద‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 4 లక్షల కోట్ల‌రూపాయ‌ల‌కు పైగా ఉంది.. వీటికి అదనంగా కార్పొరేషన్ల పేరుతో సుమారు లక్షా 5 వేల కోట్ల రూపాయలు అప్పలుగా ఉన్నాయి.. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ. 47 వేల కోట్లు, మిషన్ భగీరథ కింద రూ. 25 వేల కోట్లు, ఇతర కార్పొరేషన్ల కింద రూ. 32 వేల కోట్లు అన్నాయి. ఈ లెక్కన రాబోయే రెండేళ్లలో అప్పులను రూ. 5 లక్షల కోట్లకు చేర్చబోతోంది. 2023-24 రాష్ట్రం అప్పు రూ. 5 లక్షల కోట్లకు చేరి.. ఆ భారం ప్రజలమీద పడుతుందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అప్పులు కట్టడానికి, అప్పులకు వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తోంది. ఇది కాకుండా గత ప్రభుత్వాలు అందించిన ఆస్తులను కూడా లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు.

అప్పులు ఓ వైపు.. భూముల అమ్మకం ఇంకో వైపుతో రాష్ట్రాన్ని దివాలా తీయించడమే పనిగా కేసీఆర్ పెట్టుకున్నారు. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని సీఎల్పీ నిర్ణయించింది. అమ్మకానికి పెట్టిన భూములు.. అప్పుల వివరాలు జనం ముందు పెట్టాలి. ప్రభుత్వం మొండిగా భూములు అమ్మితే... వేలాన్ని అడ్డుకుంటాం. ఇప్పటి వరకూ తెచ్చిన అప్పులు, అమ్మిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. అంతేకాక అమ్మకానికి పెట్టిన భూముల వివరాలను అందులో పొందుపర్చలి. మియాపూర్ భూములు, నయీం పేరుతో రిజిస్టర్ అయినవి, అలాగే నయీం అక్రమ భూములు ఎంత సురక్షితంగా ఉన్నాయి.. ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. భూముల అమ్మకాన్ని ఆపేందుకు సీఎల్పీ పక్షాన గవర్నర్ ను కలిసి.. వినతి పత్రాన్ని ఇస్తాం. అలాగే వేలం వేయనున్న భూములను సందర్శించి.. అక్కడ నుంచే మీడియా ద్వారా ప్రజలకు అన్ని వివరాలు అందిస్తాం. మేము ఇన్ని చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వేలానికి వెళితే.. ఆ ప్రాంతానికి సీఎల్పీ నాయకులు వెళ్లి కచ్చితంగా అడ్డుకుంటాం. వేలంలో ఎవరైనా భూములు కొనేందుకు ఎవరూ రావద్దు.. 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. మేము పాలనలోకి వచ్చిన తరువాత ఈ భూములు తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని ప్రజలకు ఇస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర జిల్లాల్లో నాటి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు.. పేదలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ని కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తీసుకుని వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. దీనిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూముల అమ్మకాన్ని ఆపడం కోసం జిల్లాల వారీగా ఒక కార్యాచరణ ప్రణాలిక తీసుకోబోతున్నాం.

ఈ రాష్ట్రాన్ని మనకు మనమే కాపాడుకోవాలనే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. ఆస్తులు మనవి.. రాష్ట్రం మనది.. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలి కానీ.. వీటిని అడ్డగోలుగా తెగనమ్ముకుంటుంటే చూస్తూ కూర్చోం ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూములు అమ్మకాలు జరుగుతుంటే... ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలనే ఉద్దేశంతోనే సోనియగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మకాలకు తెరలేపిందో చెప్పాలి. భవిష్యత్ తరాలకు ఏమాత్రం మిగల్చకుండా భూముల అమ్మకానికి ఎందుకు సిద్దపడ్డాడో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రానికి కేటాయించిన అధికారి కాదు.. ఆయనకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది. సీఎల్పీ నాయకుడిగా నా పనితీరు మీద వీహెచ్ కు సొంత అభిప్రాయం ఉంటుంది. పీసీసీ నియామకంలో నా పాత్ర చాలా చిన్నది.. పీసీసీపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.

Next Story
Share it