Telugu Gateway
Politics

అవినీతి రహిత తెలంగాణ కావాలి

అవినీతి రహిత తెలంగాణ కావాలి
X

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవినీతి రహిత రాష్ట్రం కావాలన్నారు. అమరుల ఆకాంక్షల మేరకు ముందుకు వెళ్ళాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 83 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. వరంగల్ స్మార్ట్ సిటీకి 2740 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని తెలిపారు. వరంగల్ లో కూడా ఇటీవల వరదలు వచ్చాయని మరి ఇక్కడ ప్రజలకు ఎందుకు పది వేల రూపాయల సాయం చేయలేదన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి భద్రకాళీ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానన్నారు. వరంగల్‌.. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం, చారిత్రక నగరం, రాజకీయ చైతన్యం ఉన్న నగరం, రజకారులను తరిమికొట్టిన చరిత్ర ఉన్న నగరమని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతోంది.

సీఎం కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తెలంగాణలో అమలు కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య భీమా రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలోనే మొదటిసారి జాతీయ రహదారి రోడ్లను సిమెంట్‌తో నిర్మాణం చేపట్టామని, అది అతిత్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభిస్తామని చెప్పారు. మామునూరు ఎయిర్ పోర్ట్‌ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పని చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతగా వరంగల్‌ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాతో తనకు 1996 నుండి అవినాభావ సంబంధం ఉందని, ఇక్కడ తనకు అణువణువు తెలుసునన్నారు. హైదరాబాద్‌లో ఆదరాబాదరాగా ఎన్నికలు పెట్టి బీజేపీని బలహీన పరచడానికి చూశారని, కానీ.. టీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందని అన్నారు.

Next Story
Share it