మేయర్ పై నిర్ణయానికి సమయం ఉంది
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల్లో తాము ఆశించినట్లు సీట్లు రాలేదన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఈ ఫలితాల్లో ఇంకా 20- 25 సీట్లు ఎక్కువగా వస్తాయని అనుకున్నాం. 12 చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాం. ఈ ఓటమితో నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించినందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఎగ్జిట్ పోల్స్ లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో మాకు అతి పెద్ద పార్టీగా అవకాశమిచ్చారంటే మాపై ప్రజలకున్న నమ్మకం ఇంకా పోలేదని భావిస్తున్నాం. ఓటమికి కారణాలను అన్వేషిస్తూ పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం. మేయర్ పీఠం గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. 150 డివిజన్లలో కష్టపడిన టిఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ' కేటీఆర్ పేర్కొన్నారు.