తెలంగాణలో మరో ఎన్నికల సమరం
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు
ఏప్రిల్ 30న పోలింగ్..మే3న ఫలితాలు
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే అతి తక్కువ సమయంలో మినీ మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేయటం..మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణలో ఇప్పుడు రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుండగా, ఉపసంహరణకు 22వ తేదీన తుది గడువు విధించారు. ఇక ఏప్రిల్ 30న పోలింగ్ జరుగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎప్పటిలాగానే ప్రతిపక్షాలకు పెద్దగా సమయం ఇవ్వకుండా అత్యంత వేగంగా ఎన్నికలు పూర్తి చేసుకునేందుకు వీలుగా సర్కారు పావులు కదిపినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. సర్కారు మాత్రం గత కొన్ని రోజులుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే జీహెచ్ఎంసీ అనుభవంతో ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వారు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారబోతుంది.