Telugu Gateway
Politics

వైజాగ్ కు అభివృద్ధి కావాలా..రాజ‌ధాని కావాలా?.

వైజాగ్ కు అభివృద్ధి కావాలా..రాజ‌ధాని కావాలా?.
X

ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఏర్పాటు చేసి..వైజాగ్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వైజాగ్ ను ఐటి, ఫార్మా రంగాల‌తోపాటు అన్ని విష‌యాల్లో దేశంలోనే అగ్రాగామిగా నిల‌పాల‌ని తాము ప్ర‌య‌త్నించామ‌ని వెల్ల‌డించారు. మీకు రాజ‌ధాని కావాలా..అభివృద్ధి కావాలా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ బాదుడే బాదుడుకి విరుగుడు తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై జ‌గ‌న్ స‌ర్కారు భారం మోపింద‌ని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రో ధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పిన విష‌యాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసిరారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారనిచంద్రబాబు మండిపడ్డారు.

టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని, ఈ పోరాటం తన కోసం కాదని, మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.: తన కాన్వాయ్‌ నిలిపివేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని, తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్‌లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని హెచ్చ‌రించారు. విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేప‌ర్లు లీక్ అవుతుంటే ఏమి పీకుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it