అంతర్జాతీయ వెన్నుపోటు సంఘం అధ్యక్షుడు
తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అంతర్జాతీయ వెన్నుపోటు సంఘానికి అధ్యక్షుడు అని వ్యాఖ్యనించారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ పరంగా జరగవని అన్నారు. అలాంటిది చంద్రబాబు మానిఫెస్టో ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు మానెఫెస్టో ఎలా విడుదల చేస్తారన్నారు.
2024 వరకు టీడీపీ ఉంటుందా? ఉండదా? అనే సందేహం వచ్చిందేమోనని విజయసాయి అన్నారు. కులపిచ్చితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.గతంలో కూడా నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు నిలిపివేశారని అన్నారు.