రాయలసీమ లిఫ్ట్ కు అనుమతి ఇవ్వాలి
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతోపాటు కేఆర్ఎంబీ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరినట్లు విజయసాయి చెప్పారు. భవిష్యత్ లో చట్టప్రకారమే వ్యవహరించాలని చూడాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లను మంత్రి సానుకూలంగా ఆలకించారని..త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, టీఆర్ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చులో సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారన్నారు. ఇదిలా ఉంటే రఘరామక్రిష్ణంరాజు అనర్హత అంశంపై కూడా స్పీకర్ కు మరోసారి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆయన అడిగిన వివరాలు అన్నీ సమర్పించామని..ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తామని తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.