Telugu Gateway
Politics

విజయవాడ టీడీపీ వివాదం...తాత్కాలిక సర్దుబాటు

విజయవాడ టీడీపీ వివాదం...తాత్కాలిక సర్దుబాటు
X

విజయవాడ తెలుగుదేశంలో ఒక్కసారిగా రగిలిన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కన్పిస్తోంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పార్టీ నేత నాగులుమీరాలు శనివారం ఉదయం ఎంపీ కేశినేని నాని తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మాట్లాడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ పరిణామం ఆ పార్టీ నేతలు, శ్రేణులను షాక్ కు గురిచేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో మాట్లాడారు. దీంతోపాటు అచ్చెన్నాయుడు కూడా అసమ్మతి రాగం విన్పించి నేతలతో చర్చలు జరిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్ధిగా అధిష్టానం ప్రకటించిన కేశినేని శ్వేత కూడా బొండా ఉమా ఇంటికి వెళ్ళి చర్చించటంతో రగడకు పుల్ స్టాప్ పడింది. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శ్వేతనే నేరుగా ఈ ముగ్గురు నేతలను స్వయంగా కలవడంతో సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

మొదటి నుంచి శ్వేత మేయర్ అభ్యర్థిత్వంపై బొండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేశినేని శ్వేత సమావేశం తర్వాత బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగులుమీరాలు మేయర్ గా శ్వేతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్లు బుద్ధా వెంకన్న తెలిపారు.

Next Story
Share it