వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద సవాల్
రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకి తొమ్మిది లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే యంత్రాంగం ఉన్నదని, అయితే వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద సవాలుగా నిలుస్తుందని తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను అధిగమించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ తయారీదారులతోను రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అవుతుందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ల తో మాట్లాడుతున్నామన్నారు. రానున్న జూలై ఆగస్టు నాటికి వ్యాక్సిన్లు సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందని అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాలుతో సాగే వ్యవహారం అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగుతున్నదని, ప్రజల అత్యవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్ డౌన్ వలన కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఆయన గురువారం నాడు ట్విట్టర్ లో 'ఆస్క్ కెటీఆర్' పేరుతో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని, చేసిన సూచనకు స్పందించిన కేటీఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉన్నదని.... ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ లో 45 ఏళ్లకు పైబడి ఉన్న జనాభా సుమారు 92 లక్షలు ఉంటే అందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందని, మరో పది లక్షల మందికి పైగా రెండవ డోసు కూడా పూర్తయినదని అన్నారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న 45 లక్షల మందికి అందరికి రెండవ డోసు అందించడమే ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉందన్నారు. అయితే వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదని కేటీఆర్ అన్నారు.