Telugu Gateway
Politics

ఐదున్నర కోట్ల వీసాల తనిఖీ

ఐదున్నర కోట్ల వీసాల తనిఖీ
X

ఎవరెన్ని విమర్శలు చేసిన నా స్టైల్ మారదు అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏది అనుకుంటే అది అమలు కావాల్సిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా ఆయన తన దారి మార్చుకోవటం లేదు. సుంకాల దగ్గర నుంచి వలస విధానాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దేశాలు డోనాల్డ్ ట్రంప్ తో ఢీ అంటే ఢీ అంటుంటే మరి కొంత మంది మాత్రం వేచి చూసే ధోరణిలో వెళుతున్నారు. చూస్తుంటే డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు గతంలో ఒకరిపై ఒకరు కత్తులు కూడా దూసుకున్న వాళ్ళు కూడా కలిసి ముందుకు సాగే వాతావరణం వస్తోంది. ఇది కేవలం ట్రంప్ దూకుడు నిర్ణయాల కారణంగానే. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులపై మరో పెద్ద బాంబ్ వేయటానికి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. అమెరికాలోని 5.5 కోట్ల మంది వీసా పత్రాలను పరిశీలిస్తామని ట్రంప్ సర్కారు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లగించారా లేదా అన్నది నిర్దారించుకోవటానికి ఇది అంతా చేస్తున్నట్లు తెలిపారు.

తమ పరిశీలనలో ఎవరైనా నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా...ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచినా...వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అమెరికా లో ఉంటున్న వాళ్ళను వెనక్కి పంపే చర్యల్లో భాగంగా ఇది అంతా చేస్తున్నారు. అమెరికాలో చేపట్టిన వీసా సమీక్షల్లో ఇదే అతి పెద్దదని సమాచారం. విద్యార్థులు, ఎక్సేంజ్ వీసాదారులతో పాటు వివిధ వర్గాలపై ప్రభుత్వ చర్యలు ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చట్టప్రకారం ఈ సమీక్షలు జరుగుతాయా లేదా అని వలసదారుల హక్కుల సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 6 వేల వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశాన్ని వీడకపోవడం, నేరాలకు పాల్పడటం, మద్యం మత్తులో డ్రైవింగ్, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు దిగిన వారి వీసాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. ఉగ్రవాదానికి మద్దుతు ఇచ్చిన కారణంగా సుమారు 200 నుంచి 300 మంది వీసాలను రద్దు చేసినట్టు కూడా తెలిపింది. భారతీయ విద్యార్థులు కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ లో పెడితే ఏకంగా వల్ల వీసా లను కూడా రిజెక్ట్ చేసిన ఘటనలు నమోదు అయ్యాయి.

Next Story
Share it