Telugu Gateway
Politics

టార్గెట్ ఖర్గ్ ఐలాండ్ తో యుద్ధం తీవ్రరూపం

టార్గెట్ ఖర్గ్ ఐలాండ్ తో యుద్ధం తీవ్రరూపం
X

ఇరాన్ పై యుద్ధం విషయంలో అంచనాలు తలకిందులు కావటంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దాడులను మరింత తీవ్ర తరం చేశారు. ఇటీవలే ఇరాన్ లో తాము అనుకున్న లక్ష్యాలు అన్నీ పూర్తి చేశామని...అక్కడ తాము చేయటానికి ఇంకా ఏమి మిగలలేదు అన్నారు. అదే సమయంలో యుద్ధం ఎప్పుడు అంటే అప్పుడు నిలిపివేస్తామని ప్రకటించిన ఆయన ఇప్పుడు మరో సారి ఇరాన్ పై భారీ దాడులకు దిగారు. అది కూడా ఇరాన్ కు ఆర్థికంగా ఎంతో కీలకం అయిన ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీంతో మరో సారి పశ్చిమాసియాలో యుద్ధం మరింత పెరిగినట్లు అయింది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్స్ పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్లు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన ఆదేశాలతో జరిగిన ఈ దాడిలో ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలు ధ్వంసం అయినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.

మధ్యప్రాచ్యం చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడులు జరిపామని, అయితే ఖర్గ్ ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయాల జోలికి వెళ్లలేదని ట్రంప్ చెప్పారు. వ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే ఖర్గ్ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఖర్గ్ దీవి నుంచే సరఫరా అవుతుంది. ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడులకు ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇరాన్ ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తే అమెరికాకు సహకారం అందిస్తున్న సంస్థలకు చెందిన చమురు, ఇంధన మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామని ఇరాన్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించింది.

తాజా పరిణామాలతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమ దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవి అని...తాము టార్గెట్ చేసిన వాటిని కాపాడుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు అన్నారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటానికి వీలు లేదు అన్నారు. యుద్ధంలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఖర్గ్ ఐలాండ్ ను టార్గెట్ చేయటం ప్రమాదకర పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అమెరికా ఎంబసిలతో పాటు ఆ దేశానికీ సంబంధము ఉన్న ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తోంది.

Next Story
Share it