కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంటోంది. దీంతో ఆ పార్టీకి వరస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినా సరే ఆ పార్టీ వైఖరిలో మార్పు రాకపోవటమే విచిత్రం. ఎవరైనా తప్పులు జరుగుతున్నాయి అని గుర్తిస్తే దిద్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ లో అదేమీ కన్పించకపోవటంతో నేతలు వరస పెట్టి షాక్ లు ఇస్తున్నారు. వచ్చే ఏడాది దేశంలోనే రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ బుధవారం నాడు ఢిల్లీలో బిజెపి లో చేరిపోయరు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆయనకు బిజెపి సభ్యత్వం ఇచ్చారు. జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావటం విశేషం. 2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ ప్రసాద్ కూడా ఒకరు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ ..' బ్రాహ్మిన్ చేత్న పరిషత్'ను గత సంవత్సరం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితమే ఆయన్ను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పశ్చిమ బెంగాల్ జనరల్ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరటం కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. బిజెపిలో చేరిన అనంతరం జితిన్ ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్నేళ్లు గా దేశంలో జాతీయ పార్టీ అంటే బిజెపియే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో తమకు మూడు తరాల అనుబంధం ఉందని..అందుకే పార్టీ మారేందుకు చాలా ఆలోచించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.